జనం కోసం పోరాడుతున్నందుకే జైలుకు!

జల్లిపల్లి 1 నవంబర్ 2012 :  జగన్ జైలుకు వెళ్లింది జనం కోసమేనని షర్మిల అన్నారు.మరో ప్రజాప్రస్థానం 15వ రోజు పాదయాత్రలో భాగంగా గురువారం ఆమె అనంతపురం జిల్లా జల్లిపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ జగన్ జనం కోసం పోరాడుతున్నాడనే కాంగ్రెస్, టిడిపి కుట్ర పన్ని జైలుపాలు చేశాయన్నారు. "జగన్ ఎవరి కోసం జైలుకెళ్లాడు? జనం కోసమా? మహిళల కోసమా? రైతుల కోసమా? విద్యార్థుల కోసమా? అని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడుగుతున్నారు. ఆయనకు ఇదే నా సమాధానం. అవును.. జగనన్న రైతుల కోసం పోరాడారు. పేద ప్రజల కోసం పోరాడారు. విద్యార్థుల కోసం పోరాడారు. మహిళల కోసం పోరాడారు. చేనేత కార్మికుల కోసం పోరాడారు. దీక్షలు చేశారు. అలా పోరాడడం వల్ల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనే మీరు జైలులో పెట్టారు. అలా పోరాడడం వల్ల మీకు, టీడీపీకి స్థానం ఉండదనీ, మీరు ఉనికి కోల్పోతారనే జైలులో పెట్టారు. కుమ్మక్కై నీచమైన కుట్రకు పాల్పడ్డారు." అని షర్మిల దీటుగా జవాబు ఇచ్చారు.
జగన్ ఎవరి కోసం పోరాడి జైలుకు వెళ్లాడో అడగాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్టోబర్ 31 న మెదక్ జిల్లా సంగారెడ్డి సభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల సమాధానమిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నందునే జగన్ ను జైలుకు పంపారన్నారు.
 "మీరు సీబీఐని వాడుకున్నారు. గుండెల మీద చేయి వేసుకుని మీరు నిజం కూడా చెప్పలేరు"  అని షర్మిల దుయ్యబట్టారు. జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్ పబ్లిక్ మీటింగ్‌లోనే చెప్పిన సంగతి ఆమె గుర్తు చేశారు. "దాని అర్థం ఏమిటి? కావాలనే జైలులో పెట్టారనే కదా? కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారనే కదా!" అని షర్మిల నిలదీశారు. "రాజన్నకుటుంబం ఈరోజు ఒక మాట చెబుతోంది. జగనన్న ఏ తప్పూ చేయలేదు. ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఒక రోజు వస్తుంది. ఆ రోజు నిజం తెలుస్తుంది. ఆ రోజు జగనన్న తప్పకుండా బయటకు వస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని షర్మిల ప్రజలను కోరారు.


Back to Top