ప్రభుత్వ వైఖరిపై షర్మిల మండిపాటు

ఖమ్మం, 26 ఏప్రిల్ 2013:

జిల్లా ఏదైనా సరే.. కదిలిస్తే చాలు కరెంటు కష్టాలను చెప్పుకుంటూ రైతన్నలు షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. బోర్లు, బావుల్లో నీరున్నా విద్యుత్తు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సాగింది.  ముదిగొండ మండల కేంద్రం శివారులోని పారిశ్రామికవాడలో రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొని, గ్రానైట్ పరిశ్రమ యజమానుల సమస్యలు విన్నారు. అధైర్యపడవద్దనీ, తమ పార్టీ వారికి అండగా ఉంటుందనీ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు.

ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు..

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో ఎన్ని జల విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ థర్మల్ విద్యుత్తు నుంచి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది.. ఏ సీజన్‌లో ఎంత విద్యుత్తు వినియోగమవుతుంది.. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎంత కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి.. ఇంకా ఎంత అవసరం తదితర విషయాలను అలవోకగా  చెప్పేవారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నేతలకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పాలకులు చేసిన తప్పులకు ఈరోజు రైతులు, ప్రజలు, పారిశ్రామిక వేత్తలు శిక్షలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి వర్గానికీ మహానేత సేవలు చేశారు కాబట్టే కులమతాలకు అతీతంగా ప్రజలు ఆయన్ను ఇంతలా గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. ఒక్క రూపాయి చార్జీ పెంచినా రైతులు, పేదలపై భారం పడుతుందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఆలోచించేవారని పేర్కొన్నారు. గ్రానైట్ పరిశ్రమను నిలబెట్టడానికి రాయల్టీలో మహానేత డాక్టర్ వైయస్ఆర్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కరెంటు బిల్లు యూనిట్ ధరలో సబ్సిడీ ఇచ్చిన విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో కరెంటు సంక్షోభంతో వేల పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని శ్రీమతి షర్మిల  హెచ్చరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రానైట్ పరిశ్రమకు చేయాల్సిన మేలు అంతా చేస్తారు. కరెంటు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీల విషయంలో గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. కార్మికులకు ఉపాధి కల్పించ డం, వారికి ఇళ్లు, తెల్లరేషన్ కార్డులు, వారి పిల్లల చదువుల విషయంలో అండగా ఉంటుంది. గుజరాత్‌ను మించేటట్టు ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగనన్న తీర్చిదిద్దుతారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం గోకినేపల్లి నుంచి ప్రారంభమైన 131వ రోజు పాదయాత్ర  వెంకటాపురం, ముదిగొండ, సూర్యపేట క్రాస్ రోడ్డు, ఖమ్మం శివారులోని ఆటోనగర్ మీదుగా సాగింది. గురువారం శ్రీమతి షర్మిల 13.7 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1771.5 కి.మీ. యాత్ర పూర్తయింది.

Back to Top