ప్రభుత్వాన్ని మేల్కొలుపుతాం: విజయమ్మ

తుని:

మొద్దు నిద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టంచేశారు. అకాల వర్షాల వల్ల సంభవించిన వరదలతో రాష్ట్రం  పరిస్థితి దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మాకున్న 17 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామనీ,  అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నిలదీస్తామనీ ఆమె చెప్పారు. వరద బాధితులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో తీర్మానానికి డిమాండ్ చేస్తామని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విజయమ్మ బుధవారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులు, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. తునిలో విలేకరులతో, విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వరదల వల్ల దెబ్బ తిన్న జిల్లాల్లో మూడు రోజులుగా పర్యటించాను. ఎక్కడా బాధితులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అందడంలేదు. వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఎక్కడా తక్షణ సాయం ప్రకటించలేదు’ అని విమర్శించారు.

     దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ నివేదిక కోసం నిరీక్షిస్తే  రైతులకు ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. పంటల బీమా ద్వారా 25 శాతం పరిహారం తక్షణమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1.5 లక్షల పరిహారాన్ని రూ.3 లక్షలకు పెంచాలన్నారు. వరదల వల్ల పాడైన కొబ్బరిని నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరారు. తమలపాకుల పంట రైతులకు భారీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఏలేరు ఆధునికీకరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.132 కోట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఆ పనులు పూర్తిచేయలేదని చెప్పారు.
అధికారంలో లేనందున ప్రత్యక్ష సాయం చేయలేకపోతున్నాం
     తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో ఉన్న తాండవ రిజర్వాయర్ ఆధునికీకరణ కాక వేలాది కుటుంబాలు ముంపుబారినపడి సర్వస్వం కోల్పోయాయని తెలిపారు. తాము అధికారంలో లేకపోవడంవల్లే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల్ని ఓదార్చడం మినహా ప్రత్యక్ష సాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైయస్ఆర్‌లానే రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చడానికి వై.యస్.జగన్మోహన్‌ రెడ్డి నిరంతరం శ్రమిస్తారని హామీ ఇచ్చారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు.

Back to Top