పేదలు కన్నెర్ర చేస్తే..!

గుంటూరుః వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై మండిపడ్డారు. చంద్రబాబు హయంలో చేతగాని పరిపాలన సాగుతుందని ఫైరయ్యారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని దుయ్యబట్టారు. సామాన్యుడు కడుపునిండా  తినలేని దౌర్భాగ్య  పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రూ. వేయి కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు..వాగ్ధానాలన్నీ గాలికొదిలేశాడన్నారు. ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై పేదవాడి బతుకుపై భారం మోపుతున్నాడని చంద్రబాబుపై అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోజంతా కూలీకి వెళితే వచ్చే రూ. 200 తో సామాన్యుడు ఏం తినగలడని అప్పిరెడ్డి ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాలనే  రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.  ఇది ఒక్క వైఎస్సార్సీపీ అంశం కాదని ఐదున్నర కోట్ల ప్రజానీకానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. పేదలు కన్నెర్ర చేయకముందే ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దహించుకుపోవడం తథ్యమన్నారు. గుంటూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. 
Back to Top