పేదల వ్యతిరేకి ప్రభుత్వం

విజయవాడః చంద్రబాబు ప్రభుత్వం పేదల వ్యతిరేకి ప్రభుత్వమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, టీడీపీ నేతల జేబులు నింపేందుకే చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఉపాధి పనులు లేక ప్రజలు పొట్టచేతబట్టుకొని దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి  హామీ పథకంతో పేదలు గౌరవంగా బతికేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే...బాబు మాత్రం పేదల పొట్టగొడుతూ నిధులను పచ్చచొక్కాలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. బాబు అధికారంలోకి వస్తూనే ఆగష్టు 12 2014న ఉపాధి హామీ పథకం పనుల్ని ఆపమని మెమో ఇచ్చిన ఘనుడని దుయ్యబట్టారు.  ఆరోజు ఉపాధి హామీ పథకం జరిగిన తీరుతెన్నులపై ఐఏఎస్ ఆఫీసర్స్  తో కమిటీ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పింది వాస్తవం కాదా..?అని బాబును నిలదీశారు. 

ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వైయస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే..నిధులు రాకుండా అడ్డుపడుతోందంటూ చంద్రబాబు నానా యాగీ చేయడంపై పార్థసారధి ఫైర్ అయ్యారు. ఉపాధి పనుల్లో 146కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని, దీనికి  ఏం సమాధానం చెబుతారని బాబును, మంత్రులను ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ కూడ వైయస్సార్సీపీయే రాసిందని చెబుతారా..? అంటూ  ధ్వజమెత్తారు.  కేంద్రానికి సంబంధించిన ఇండిపెండెంట్ బాడీ కూడ ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పిందన్నారు. 2016కు సంబంధించిన ఉపాధి హామీ పనుల్లో 350కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఈనాడులో వచ్చిన వార్తను మీడియా ముఖంగా చూపించారు.  వాళ్లు రాస్తే ఏమనిపించదు గానీ...మేం మీ తప్పుల్ని ఎత్తిచూపితే అబివృద్ధికి అడ్డుపడుతున్నారని పాట పాడతారా..? రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు.  

ఏ పేదవాడు ఉపాధి పనులు లేక దూరప్రాంతాలకు వలసపోకూడదు, అదే గ్రామంలో కనీసం 100 రోజులైనా పని కల్పించాలంటే... బాబు దానికి తూట్లు పొడుస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. కూలీలను మాత్రమే వినియోగించి వారికి ఉపాధి కలిగించి ఖర్చుపెట్టాల్సిన నిధుల్ని కాంట్రాక్టర్ల కోసం,  టీడీపీ నేతల జేబులు నింపేందుకు యంత్రాలతో పనిచేయిస్తున్నారని అన్నారు.  పేదల పక్షాన నిలబడడం కూడ అభివృద్ధికి అడ్డుగా భావిస్తారా అని బాబు, మంత్రులను ప్రశ్నించారు. గౌరవంగా బతికిన పదెకరాల రైతులు కూడ బాబు పాలనలో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్న పరిస్థితి ఉందని అన్నారు.  రెండున్నరేళ్లలో పదిలక్షల మంది వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే  దాన్ని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని చంద్రబాబును నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో  మా నాయకుడు నిలదీశారని పార్థసారధి గుర్తు చేశారు. ప్రధాని కుర్చీ నా చేతిలో ఉందని తొడలు గొట్టారే గానీ.... వలసలను ఆపాలని గానీ, పేదవాళ్ల కడుపు నింపాలని గానీ ఏనాడైనా ప్రయత్నించారా బాబూ అని విరుచుకుపడ్డారు.  వైయస్ఆర్ తన హయాంలో అత్యధికంగా ఉపాధి హామీ పథకం నిధులు తీసుకొచ్చి పేదలు గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పించారన్నారు. బాబు  ఎంత నీచానికి దిగజారారంటే... 13 లక్షల ఇళ్లు ఉపాధి హామీ పథకం కింద కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తే వాటిని కూడ ఆపేశారని మండిపడ్డారు. 
Back to Top