ప్రజల ముందుకు వెళ్లే ధైర్యంలేక ఫిరాయింపులు

  • విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • ఆత్మహత్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • కుల రాజకీయాలు, వెన్నుపోటు పొడవడం బాబు నైజం
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజ
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల ముందుకు వెళ్లే దమ్మూ, ధైర్యం లేక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజలు మరోమారు ఆయన వలలో పడకండి అని ఆమె సూచించారు. మంత్రి నారాయణ కళాశాల్లో వారం రోజులుగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆమె తప్పుపట్టారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మజ మీడియాతో మాట్లాడారు. విద్యాలయాల్లో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పిల్లలకు భద్రత కల్పించారని గుర్తు చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టకపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందజేసి విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. ఇవాళ తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బంగారు విష్యత్తును ఇవ్వాలని అప్పులు చేసి, పైసా, పైసా కూడబెట్టి కాలేజీలకు పంపితే తమ బిడ్డలు అకారణంగా, అన్యాయంగా బలి అవుతుంటే దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంతవరకు కేబినెట్‌లో ఒక్కసారి కూడా చర్చించలేదని ఆమె ఫైర్‌ అయ్యారు.  విద్యార్థులు చనిపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దేనిమీద ప్రాధాన్యత చూపుతుందని ఆమె ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్నడు ప్రతిపక్ష పార్టీలను ముక్కలు చేయాలని ఆలోచన చేయలేదన్నారు. వేరే పార్టీ వారికి కండువలు కప్పిన దాఖలాలు లేవని, అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా ఏనాడు ప్రవర్తించలేదని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు విద్యార్థుల మరణాలను పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. యూనివర్సిటీలను రక్షించే ప్రయత్నం చేయడం లేదని, కాలేజీలను కాపాడటం లేదని ఆరోపించారు. తనకు అనుకూల వర్గాల విద్యా సంస్థలను పెంపొందించే దిశగా వారికి ఎలాంటి నష్టం జరుగకుండా ఉండేలా చంద్రబాబు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక లావాదేవీల్లో వారు బినామీలుగా ఉండటంతోనే సీఎం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రతిపక్షాలు లేకుండా ఏకపక్షంగా ప్రజల్లోకి వెళ్లాలి, రేపు తిరిగి ప్రభుత్వాన్ని ఎలా సాధించుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో ఈ పథకం ప్రవేశపెట్టాను, ఈ వర్గానికి ఈ మేలు చేశానని చెప్పుకుంటాడన్నారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇవాళ ఏ  ఒక్క పథకమైనా గుర్తు ఉండేలా చేశారా అని నిలదీశారు. బాబు చిన్న తనం నుంచి కూడా నీచమైన కుల రాజకీయాలు, అక్రమ, అడ్డదారుల్లో రాజకీయాలు చేయడం ఆయన నైజమని పేర్కొన్నారు. ఈ మూడున్నరేళ్లలో కూడా అదే వరవడి కొనసాగించారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా, ఆయన సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేయకముందే  వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీని ప్రలోభపెట్టి తన పార్టీలోకి చేర్చుకున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు వెన్నుపొటు , ప్రజాప్రతినిధుల కొనుగోలు వైశ్రాయ్‌ హోటల్‌ నుంచే గమనించవచ్చు అన్నారు. పిలలనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడం, ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించడం ఇంకా ప్రజలు మరిచిపోలేదన్నారు. 2014 తరువాత బాబు మరింత దిగజారి రాజకీయాలు చేశారని వ్యాఖ్యానించారు. తాను ఇచ్చిన ఏ  ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి కుట్రలు చేస్తున్నారని తెలిపారు. నంద్యాల ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని వందల కోట్లు అడ్డదారిలో ప్రజలను ఎలా ప్రలోభపెట్టారో అందరికి తెలుసు అన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చె నెల 2 నుంచి పాదయాత్ర చేపడుతుండటంతో చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే అడ్డదారుల్లో రాజకీయాలకు తెర లేపారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంటే ఉన్నారని పద్మజ స్పష్టం చేశారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టి యాజమాన్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.
Back to Top