'ఓర్వలేకే జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీల కుట్రలు'

కాకినాడ : వైయస్‌ఆర్‌సిపి అధినేత, కడప ఎంపి శ్రీ ‌వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్‌, టిడిపిలు సిబిఐని పావుగా వాడుకుని కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఆరోపించారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా కాకినాడలోని గొడారిగుంటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి పూలమాలలు వేసి‌, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కాకినాడ రూరర్ తిమ్మాపురానికి చెందిన సీనియ‌ర్ కాంగ్రె‌స్ నాయకుడు కర్రి సత్యనారాయణను కూడా పార్టీలో చేర్చుకున్నారు.

‌ఈ సందర్బంగా చిట్టబ్బాయి మాట్లాడుతూ, ద్వారంపూడి చేరికతో పార్టీకి సంక్రాంతి ముందు పండుగ వాతావరణం వచ్చిందన్నారు. సిజిసి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, శ్రీ జగన్‌కు మద్దతు ప్రకటించి 24 గంటలు కూడా గడవకుండానే చంద్రశేఖరరెడ్డికి గతంలో సిబిఐ నోటీసులిచ్చిందన్నారు. ఇప్పుడు మరోసారి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదన్నారు. ప్రజలతో కలసిపోయే చంద్రశేఖరరెడ్డి వంటి నేతల చేరికతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని సిజిసి సభ్యుడు గంపల వెంకటరమణ అన్నారు.

పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ‌,‌ శ్రీ జగన్ పైనా, పార్టీపైనా కాంగ్రెస్‌, టిడిపిలు ఎన్ని కుయుక్తులు పన్నినా జనం వైయస్‌ఆర్‌సిపి వెంటే ఉన్నారన్నారు. కాంగ్రెస్, ‌టిడిపిల కుమ్మక్కు రాజకీయాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, మాజీ ఎంపి బుచ్చి మహేశ్వరరావు హెచ్చరించారు.

కాగా,‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న మీడియా ప్రశ్నకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పందిస్తూ, శ్రీ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని అన్నారు. సాధారణ కార్యకర్తలా పార్టీకి సేవ చేయమన్నా తాను సిద్ధమే‌ అన్నారు. ముందుగా మహానేత డాక్టర్ వై‌యస్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.‌
Back to Top