ఫిరాయింపుదారుల‌కు ఎమ్మెల్యే జంకె, కొండారెడ్డిల సవాల్

రాజంపల్లె  : వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు వెంటనే తమ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమేనా అంటూ మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిలు సవాల్ విసిరారు.  తిరుమలనాథ స్వామి బ్రహోత్సవాల సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున మండల నాయకులు, కార్యకర్తలు విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎమ్యెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు టీడీపీలో చేరడానికి డబ్బుల కోసమా, స్వప్రయోజనాల కోసమా, అధికారం ఉందని సంపాదన కోసమా అని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.  ఈ రోజు వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసిన నాయకులు రేపు టీడీపీకి ద్రోహం చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించినంత కాలం వర్షాలు సకాలంలో కురవడంతో చెరువులు, కుంటలు నిండి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండి ఆనందంలో మునిగి తేలారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో గతంలో తొమ్మిదేళ్లు, ప్రస్తుతం పాలనలో వర్షాలు లేక గ్రామాల్లో సాగు నీరే కాకుండా తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి డ్యామ్‌లు, కాలువలకు, సొరంగాలకు కొన్ని కోట్లు నిధులు విడుదల చేసి, పనులు వేగవంతం చేసిన ఘనత  వైఎస్సార్‌కు దక్కిందన్నారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్‌ను 2019లో ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top