సమైక్య పోరులో ఒకే ఒక్క వైయస్ఆర్‌సీపీ

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

2 ఫిబ్రవరి 2014: సమైక్యాంధ్ర కోసం నిరంతరం అవిరళ కృషిచేస్తున్న ఏకైక పార్టీ వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు.  మహానేత డాక్టరె‌ వైయస్‌ఆర్ కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ కృషి చేస్తుంద‌ని ఆమె ప్రకటించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పోరాటాల్లో పుట్టి పోరాటాల్లో పెరిగిందని ‌శ్రీమతి విజయమ్మ చెప్పారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాడి సమైక్య రాష్ట్రాన్ని నిలుపుకుందామన్నారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ‌ఆదివారం జరిగిన వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ రెండవ ప్లీనరీలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరెడ్డి అకాల మరణంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నప్పుడు తమకు మనో నిబ్బరాన్నిచ్చిన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ పోరాడిన ప్రతి కార్యక్రమానికి అండగా నిలిచిన, ఉపఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలకు శ్రీమతి విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు. ఆపద సమయంలో ప్రజలు ఇచ్చిన అండతో, గుండె నిబ్బరంతో తాము ముందుకు నడిచామని గుర్తుచేశారు. కుట్రలను తిప్పికొట్టిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. గమ్యం చేరడానికి మహానేత వైయస్ఆర్‌ 25 ఏళ్ళు కష్టపడ్డారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. రైతుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం వైయస్ఆర్‌ కృషి చేశారన్నారు. ఆయన  పాలనలో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం 104, 108, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్ లాంటి ఎన్నో పథకాలను ‌మహానేత ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

వైయస్‌ అకాల మరణంతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైయస్ఆర్‌ 104,108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయిబర్సుమెంట్‌, రుణ మాఫీ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మాటలు మహానేత వైయస్ఆర్‌ హృదయాన్ని బాగా కలచివేశాయని తెలిపారు. డాక్టర్‌ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని‌ శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్‌ఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించేందుకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కంకణం కట్టుకుందని చెప్పారు.

చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పాటు ఆయన తెలంగాణకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలతోనే యూపీఏ ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకుందని  విజయమ్మ చెప్పారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకులు సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడే అని ఆమె ఆరోపించారు. వీరిద్దరూ ఈ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం అన్నారు. విభజన బిల్లును కేంద్రానికి పంపడంలో కిరణ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అనిపిస్తోందన్నారు. విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి దానిలో తప్పులను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

జగన్‌బాబు మీద కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ అవుతున్నాయని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు 90 రోజులకే రావాల్సిన బెయిల్‌ను 16 నెలల వరకూ రాకుండా చేశారని విమర్శించారు. ఆ ఆపద సమయంలో రాష్ట్ర ప్రజలిచ్చిన గుండెనిబ్బరంతోనే తాము ముందుకు నడిచామని చెప్పారు. జగన్‌బాబులో పోరాట పటిమ పెరిగిందనే తాను భావిస్తున్నానన్నారు. ఆర్టికలో 3లో సవరణలు చేసి అనవసరంగా రాష్ట్రాలను విభజించవద్దంటూ వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోని అన్ని పార్టీల జాతీయ నేతలను కలిసినట్లు వివరించారు.

వైయస్ జగ‌న్‌ను ఎలాగైనా అబాసుపాలు చేయాలనుకునే వారి కుట్రలు ఫలించవన్నారు. రాష్ట్ర ప్రజలు శ్రీ జగన్‌ వైపే నిలుస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆ విషయం త్వరలోనే వెల్లడవుతుందన్నారు.  రాబోయే ఎన్నికల్లో సమైక్యమే వైయస్ఆర్ ‌కాంగ్రెస్ నినాదం అని శ్రీమతి విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజలందరి కలలను జగన్‌బాబు నెరవేరుస్తారని ఆమె హామీ ఇచ్చారు.

Back to Top