సమైక్యవాదానికి చంద్రబాబు తూట్లు: శేషుబాబు

పాలకొల్లు (ప.గో.జిల్లా) :

చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న నిరాహారదీక్ష సమైక్యవాదానికి తూట్లు పొడిచేలా ఉందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ‌ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని త్వరితగతిన విభజించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన దీక్ష ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు దీక్షలు, ఆత్మగౌరవ యాత్రలను ప్రజలు ఎంతమాత్రమూ నమ్మేస్థితిలో లేరని అన్నారు. 'తెలంగాణ నోట్'కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు.

కాగా.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణుల దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. పెనుగొండలో వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో రిలే దీక్షలు 62వ రోజున కొనసాతున్నాయి.

సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని ఆకివీడు జాతీయ రహదారిపై 5,000 మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. దీంతో ఈ రహదారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్తిలి బస్టాండ్ సెంట‌ర్‌లో జెఎసి ఆధ్వర్యంలో భిక్షాటన చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్న ఆర్టీసీ డిపో కాంట్రాక్టు కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top