దళితులపై మంత్రి కావూరి దురహంకారం

హైదరాబాద్ :

దళితుల పట్ల కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేశ్‌ను అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేశ్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కావూరి దురహంకారానికి ఇది నిదర్శనం అన్నారు. రాజేశ్‌పై బనాయించిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పి విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

మంత్రి పదవి కోసం రాష్ట్ర ప్రజల సెంటిమెంటును పణంగా పెడతారా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ప్రజలు నిలదీశారన్నారు. ఈ సందర్భంగా కావూరిపై కొందరు కోడిగుడ్లు వేశారని, దానికి రాజేశ్‌ బాధ్యుడిగా చేసి పోలీసులు అరెస్టు చేసి సాయంత్రానికి వదిలిపెట్టారని శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు తెలిపారు. అయితే, కావూరి అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి మరుసటి రోజు బుధవారం మళ్ళీ రాజేశ్‌ను అరెస్టు చేయించడాన్ని వారు ఖండించారు. దళిత నాయకులపై కావూరి అసభ్య పదజాలంతో దూషించడం ఆయన దురహంకారానికి నిదర్శనం అని నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రజలను కావూరి మోసగించారని కొరముట్ల, గడికోట ఆగ్రహం వ్యక్తంచేశారు.

కావూరి సంస్థలోని దొంగ పెట్టుబడుల విషయం బయటపెడతామని కాంగ్రెస్‌ అధిష్టానం బెదరించినందువల్లే ఆయన సమైక్య వాదానికి ద్రోహం చేస్తున్నారని శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి అయ్యాక కావూరి మారిపోవడాన్ని సీమాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అహంకారపూరితంగా వ్యవహరిస్తే సహించబోమని వారు హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం నిబద్ధతతో పోరాటం చేస్తున్నది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని వారు అన్నారు.

Back to Top