లోకేష్‌కు మేలుచేస్తే లోక కల్యాణమా చంద్రబాబూ!

రాజమండ్రి, 04 జూన్ 2013:

లోక కల్యాణానికి పాటుపడతాననీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాననీ టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు చెబుతున్నారనీ, తన కుమారుడు లోకేష్ కు మేలు చేస్తే లోక కల్యాణమనరనీ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. మరో  ప్రజా ప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్సు స్టాండులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల చంద్రబాబు, కిరణ్ సర్కారులపై నిప్పులు కక్కారు. శ్రీమతి షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే..

'ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ వైఖరినీ, దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు వైఖరినీ ఎండగడుతూ మొదలైన పాదయాత్ర తూ.గో. జిల్లాలో ప్రవేశించింది. ప్రజాప్రస్థానంలో భాగంగా మహానేత డాక్టర్ వైయస్ఆర్  గోదావరి వంతెన మీదుగా వచ్చారు. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నేనూ వచ్చా. ఆ సమయంలో మనసునిండా నాన్నగారి జ్ఞాపకాలతో గుండె బరువెక్కింది. నాన్న నడిచిన రోజున 50డిగ్రీల ఉష్ణోగ్రత. ఈరోజు నేను అడుగపెట్టగానే వర్షం. నాన్నగారే ఆశీర్వదించినట్లనిపించింది. ఆరోజు మద్దతుగా ఆయన వెంట మీరంతా  నడిచారు. అందుకు గోదావరే సాక్షి.  రెండేళ్ళ క్రితం పోలవరం సాధనకు జగనన్న నడిచారు. ఆరోజు అన్నకు, ఈరోజు నాకు తోడుగా ఉన్నామని జనవాహిని చెబుతుంటే గోదావరి సాక్షీభూతమైంది. నాన్న బతికున్నా, జగనన్న బయటున్నా నాకీ అవసరం వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ కనీస కృతజ్ఞత లేకుండా రాజన్న  పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చింది. జగనన్న మీద కేసులు పెట్టి, జైల్లో పెట్టింది. అందుకే జగనన్న తరఫున నేను పాదయాత్ర మొదలు పెట్టా.

ప్రజల కష్టాలను రాజన్న అర్థం చేసుకున్నారు
రాజన్న పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారు. రోజుకు ఇరవై కిమీ. ప్రజలతో మమేకమయ్యారు. కష్టాలు కళ్ళారా చూశారు. బాధలు అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి క్షణమే ప్రజల గురించే ఆలోచించారు. అవే అద్భుత పథకాలయ్యాయి. ఆ పథకాలను చిత్తశుద్ధితో అద్భుతంగా అమలు చేసి చూపారు. లక్ష కోట్లతో 86 సాగు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. రైతులకు ప్రోత్సాహమిచ్చారు. నీళ్ళిచ్చారు, కరెంటు ఇచ్చారు., సబ్సిడీ ఇచ్చారు. వడ్డీ మాఫీ చేశారు. విద్యుత్తు బకాయిలు కూడా మాఫీ చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డిగారిది.

రైతులకి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. బ్యాంకుకు వెళ్ళని మహిళలు కూడా వెళ్లి రుణాలు తీసుకున్నారు. పేదరికం ఊబిలోంచి బయటకు రావాలని మహానేత విద్యార్థులకోసం ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారు. భరోసా కల్పించారు. లక్షలమంది గొప్ప చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆరోగ్యశ్రీ.. పెట్టారు. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు.  ఐదేళ్ళలో 50 లక్షల ఇళ్ళు కట్టారు. ఇప్పడుండి ఉంటే రెండో టెర్ములో మరో 50 లక్షల ఇళ్ళు కట్టించి ఉండే వారు.
చంద్రబబాబు తన హయాంలో 16 లక్షల మందికి పింఛన్లిస్తే రాజన్న 70 లక్షల మందికి పింఛన్లు అందించారు. మహానేత మనసు వివరించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.  ఆయన తన పాలనలో ఒక్క చార్జీ పెంచలేదు. గ్యాస్ ధర 305 దాటలేదు. ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఒక్క రూపాయి కరెంటు చార్జీలు పెంచారని ప్రతిపక్షాలు కూడా అనలేదు. పేదవారిపై భార పడకూడదనుకుని రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు. రాజన్న ఓ కుటుంబానికి  తండ్రిలా ప్రజల గురించి ఆలోచించారు. కుల, మతాలకు అతీతంగా ఆలోచించారు. ఆయన వెళ్ళిపోయినతర్వాత.. దుర్మార్గ ప్రభుత్వం.. రాక్షస రాజ్యం తయారయ్యాయి. ప్రజలు అల్లాడుతుంటే  సర్కారు కుంభకర్ణుడిలా నిద్రపోతోంది.
అన్నపూర్ణకు మారుపేరు ఉభయగోదావరి జిల్లాలు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఈ ప్రాంతంలో  క్రాప్ హాలిడే ప్రకటించారు. మద్దతు ధర ఇవ్వక రైతులను పీడించారు. మహిళలు బతుకు భారమైందంటున్నారు. పిల్లలు కూలీకి వెళ్ళకపోతే డబ్బులురావు, కుటుంబం గడవదని వాపోతున్నారు.

ఈ సర్కారు రాజన్న పథకాలకు తూట్లు పొడిచింది. జలయజ్ఞాన్ని అటకెక్కించింది. మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. ఫీజు రీయింబర్సుమెంటు కావాలంటే ఎమ్ సెట్ లో పదివేల ర్యాంకు రావాలి.. లేదా గవర్నమెంటు స్కూలులో చదవాలని నిబంధన పెట్టింది. స్తోమతు లేక, చదివిస్తుందన్న భరోసా లేక ఎంతోమంది మధ్యలోనే చదువులు ఆపేశారు. ఈ పాపం కిరణ్ సర్కారుదే. చిన్న పిల్లలకు గుండె వ్యాధులకు సంబంధించి రాజన్న 12 ఏళ్ళ వయసు వరకూ చికిత్సను అనుమతిస్తే ఈ సర్కారు దానిని రెండేళ్ళకు కుదించింది. ఆ వయసులో ఆ జబ్బున్న విషయం కూడా అర్థం కాదనే విషయం కూడా కిరణ్ సర్కారుకు తెలియక పోవడం శోచనీయం.
ఉన్న పింఛన్లు తీసేస్తోంది. పరిస్థితి చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అభయహస్తాన్ని తొలగించింది. రాజన్న హామీలను పట్టించుకోవడంలేదు ఈ సర్కారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేయాలనీ, చేనేతలు, విద్యార్థులను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డిగారు ఎన్నో దీక్షలు చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులంటే శ్రద్ధ లేదు. కిరణ్ నిర్లక్ష్యం వల్ల కరెంటు లేదు. విద్యుత్తు కనీసం మూడు గంటలు ఇవ్వడం లేదు. అది కూడా విడతలుగా ఇస్తున్నారు. ఆ కరెంటుతో చేనే తడవదని రైతులు చెబుతున్నారు. కిరణ్.. ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. వాటి మాట అలా ఉంచితే కరెంటు లేక వేల పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీన్ని గురించి కిరణ్ ఆలోచించడం లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప కూడా దాటడం లేదు. గ్రామాలలో ఆరు గంటలు మించి కరెంటు లేదు. ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూపించారు. లేని కరెంటుకు మూడింతలు బిల్లులు వస్తున్నాయి.

 ప్రజల నుంచి పుట్టిన నాయకుడికి కష్టాలు తెలుస్తాయి. ఆయన సీల్డు కవరు ముఖ్యమంత్రి. ఆయనకు అర్థం చేసుకునే తెలివి తేటలు లేవు. ఎరువులు ధరలు పదిసార్లు, ఆర్టీసీ మూడు సార్టు పెంచారు. గ్యాస్ ధర రూ. 400 దాటింది. సబ్సిడీ లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టాల్సిందే. కరెంటు అదనపు చార్జీలు రక్తం పిండైనా వసూలు చేయాలంటోంది.

గుంటనక్కలు ఈలలు వేసినట్లు
ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు ప్రభుత్వ పక్షాన నిలబడి విప్ జారీ చేసి కాపాడారు. అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకుంటే కాంగ్రెస్ బలం 146 మాత్రమే. మైనారిటీ ప్రభుత్వానికి  చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అవిశ్వాసానికి బాబు మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది. ఈ కష్టాలు ఉండేవి కావు. రాబందులు రాజ్యమేలుతుంటే.. గుంట నక్కలు ఈలలు వేసినట్లు కిరణ్ ప్రభుత్వ చేష్టలకు చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారు.

వ్యవసాయం దండగన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు
చిరంజీవి మాదిరిగా బాబు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చారు. టీడీపీని కాంగ్రెస్‌కు తోకపార్టీ అనచ్చా. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. మామను వెన్నుపోటు పొడిచి ఆయన అధికారంలోకి వచ్చారు. వ్యవసాయం దండగన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదన్నారు. ఉపకార వేతనాలను అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారు. వేతనాలను అంగన్‌వాడీలను గుర్రాలతో  తొక్కించారు. 50 రూ. హెచ̴్పీ ని 600 చేశారు.
చంద్రబాబు హయాంలో పేదలు అల్లాడారు. వారిని పురగుల్లా చూశారు. జీవనోపాధి లేక ప్రజలు వలసలు వెళ్ళారు. ఆయన నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం కుదేలైంది. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. రాజన్న వారి కుటుంబాలకు పరిహారం అందించారు.

ఎన్టీఆర్ చంద్రబాబును నక్కజిత్తులమారి అన్నారు
రెండెకరాల చంద్రబాబుకు ఇవ్పుడు ఎక్కడ చూసినా హెరిటేజ్ దుకాణాలున్నాయి. తన బినామీలకు స్థలాలను కట్టబెట్టారు. నక్కజిత్తుల బాబుకు ధన కాంక్ష, పదవీ వ్యామోహం, రంగుల మార్చడం రక్తంలో ఉన్నాయని ఎన్టీఆర్  స్వయంగా చెప్పారు.  లోక కల్యాణానికి పనిచేస్తున్నాననీ, అధికారం ఇస్తే దేశాన్ని కూడా గాడిలో పెడతాననీ,  అవినీతిపై పోరాడుతున్నాననీ, ధర్మపోరాటం చేస్తున్నాననీ చంద్రబాబు ఇటీవల డైలాగులు వల్లిస్తున్నారు. లోకేష్ కు మేలు చేస్తే లోక కల్యాణం కాదు. టీడీపీని కబ్జా చేసి. ఎన్టీఆర్ కుటంబాన్ని తొక్కేస్తే లోకకల్యాణం కాదు.. అది లోకేష్ కల్యాణమవుతుదో.. నారా కల్యాణమవుతుంది. ఇదేమవుతుందో తెలుగుదేశం కార్యకర్తలే చెప్పాలి. అన్నీ లోకేష్ కు ఇస్తారట. కార్యకర్తలు మాత్రం ఆస్తులు అమ్ముకుని పనిచేయాలట. స్వార్థం లేకపోతే వెన్నుపోటు ఎందుకు పొడిచారు. ఎన్టీఆర్నుఅధికారం లోంచి దింపి ఈయనెందుకు కూర్చున్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదని బాబు అంటే  ఆ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మరు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ ఎందుకు చేయలేదు.
నరకాసురుడు వచ్చి అధికారమివ్వమంటే ఇస్తారా?  గాడ్సే వచ్చి గాంధీ ట్రస్టుకు అధ్యక్షుణ్ణి చేస్తారా? బాబుకు అధికారమిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఎమ్మార్, కేసులో సీబీఐ విచారణ జరగకుండా చేసుకున్నారు. వ్వవస్థల్ని మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు.  పైగా వైయస్ఆర్ కాంగ్రెస్ , కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యిందని ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే జగనన్న జైలులో ఉండేవారా. మంత్రి అయ్యేవారు కాదా. జగనన్న బయటుంటే.. రాజన్న వారసుడిగా అవతరించి తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని అబద్ధపు కేసులు పెట్టి కాంగ్రెస్, టీడీపీలు ఆయనను జైలు పాలు చేశాయి. ఆరోపణల్లో ఏ మాత్రం నిజమున్నా రాజన్న బతికున్నప్పుడు చేసుండాల్సింది. నిజం లేదు కనకనే జగనన్న కాంగ్రెస్  పార్టీని విడిచిన తరవాత కుట్ర పన్ని కేసులు పెట్టారు. జగనన్న దోషి అని కోర్టు నిర్థారించ లేదు.

విలువలకూ విశ్వసనీయతకూ మారుపేరు జగన్
బాబు నిర్దోషని ఏ కోర్టూ చెప్పలేదు. చిరంజీవి నిర్దోషని ఏ కోర్టూ చెప్పలేదు. బొత్స ఉత్తముడని ఏ కోర్టూ చెప్పలేదు. చంద్రబాబుకు చావు తెలివి తేటలు ఎక్కువ కనుక విచారణ జరగకుండా చూసుకున్నారు.  2014లో ముఖ్యమంత్రవుతానని జగనన్నకు తెలుసు. పార్టీని వీడితే కష్టాలొస్తాయనీ తెలుసు.. విలువలకూ, విశ్వసనీయతకూ మారుపేరు జగన్. దేవుడి మీద నమ్మకంతో ముందడుగు వేశారు. ఇవేవీ కాంగ్రెస్, టీడీపీలకు లేవు. అంత దమ్మూ, ధైర్యం లేదు. దుర్మార్గులంతా ఒక్కటయ్యి.. జగన్ ను జైలు పాలు చేశారు. బోనులో ఉన్నా సింహ సింహమ్ఏ.. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. ఆపే దమ్మూ, ధైర్యం వీరికి లేదు. జగనన్న బయటకొచ్చి రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తాడు. అన్ని కలలూ నెరవేరుస్తాడు. ఆయనను ఆశీర్వదించాలనీ, కదం తొక్కాలనీ ప్రార్థన.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్, బొమ్మన రాజకుమార్, ఆకుల వీర్రాజు, తదితరులు సభలో పాల్గొన్నారు.

Back to Top