క్విడ్‌ ప్రోకోతో జగన్‌కు సంబంధం లేదు

న్యూఢిల్లీ, 16 జనవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి 'క్విడ్‌ ప్రో కో'తో సంబంధం లేదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు. బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్న జగన్‌బాబుపై అక్రమంగా ఈ కేసులో ఇరికించి జైలులో పెట్టారని ఆరోపించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయే నాటికి జగన్‌బాబు కడప ఎంపిగా ఎన్నికై కేవలం మూడు నెలలే అయిందన్నారు. అప్పటి వరకూ జగన్‌బాబు ఎలాంటి పదవిలోనూ లేరని శ్రీమతి విజయమ్మ వివరించారు. 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో సేకరించిన సంతకాల సిడిలను రాష్ట్రపతికి అందజేసేందుకు తన బృందంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన శ్రీమతి విజయమ్మ బుధవారం మీడియాతో మాట్లాడారు. వివాదాస్పదం  అయిన ఆ 26 జీఓలు సక్రమమే అయినప్పుడు జగన్‌బాబు దోషి ఎలా అవుతారని ఆమె నిలదీశారు. క్విడ్‌ ప్రో కో కేసుకు సంబంధించి 52వ నిందితుడిగా ఉన్న‌ శ్రీ జగన్‌ను మొదటి ముద్దాయిగా సిబిఐ అరెస్టు చేసి జైలులో నిర్బంధించడమేమిటని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. సిబిఐ కక్షపూరిత చర్యను ఆపమని చెప్పేందుకే కోటి సంతకాల ఉద్యమం నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.

అక్కసుతోనే వైయస్‌ కుటుంబానికి వేధింపులు:
నల్లకాలువలో జరిగిన మహానేత వైయస్‌ఆర్‌ సంస్మరణ సభలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్‌బాబు ఓదార్పు యాత్ర చేసినట్లు ఆమె వివరించారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చారన్న అక్కసుతోనే జగన్‌బాబును జైలులో పెట్టి వేధిస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. కుటుంబ పెద్దను పోగొట్టుకుని బాధలు పడుతున్న తమను ఇన్ని విధాలుగా వేధించడం తగదని ఆమె అన్నారు. దొంగ లెక్కలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. శ్రీ జగన్‌ నిర్దోషి అని చెబుతూ కేవలం 20 రోజుల్లో రెండు కోట్లకు పైబడి సంతకాలు చేశారని, వారందరికీ ఆమె చేతులెత్తి ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఆంక్షలు పెట్టింది:
మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిత మృతిని తట్టుకోలేక రాష్ట్రంలో సుమారు 6 నుంచి 7 వందల మంది ప్రాణాలు వదిలారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేసుకున్నారు. తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాల కారణంగా ప్రాణాలు విడిచిన వారందరి కుటుంబాలను పరామర్శించాలని శ్రీ జగన్‌ నల్ల కాలువ సభలో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ప్రకటించారన్నారు. ఇచ్చిన మాట కోసం నిలబడే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా జగన్‌బాబు ఓదార్పు యాత్ర చేపట్టారన్నారు. అయితే, ఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆంక్షలు పెట్టిందన్నారు. జిల్లాకు ఒక చోట సభ ఏర్పాటు చేసి ఓదార్చమన్నదని చెప్పారు. అయితే, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉన్న వారిని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడమే ధర్మంగా భావించిన‌ శ్రీ జగన్ తన మాటకే కట్టుబడ్డారని చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి జగన్‌బాబు బయటికి వచ్చిన వారం లోపే కేసులు నమోదు చేశారని శ్రీమతి విజయమ్మ తెలిపారు.

కడప లోక్‌సభా స్థానంలో 5 లక్షల ఓట్ల మెజారిటీతో శ్రీ జగన్‌ విజయం సాధించడాన్ని కాంగ్రెస్‌, టిడిపిలు జీర్ణించుకోలేకపోయాయని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి జగన్‌బాబుపై కుట్ర పన్నాయన్నారు.‌ జగన్‌బాబుపై కోర్టుకు వెళ్ళాయన్నారు. చివరికి సిబిఐని వాడుకుని దాడులు కూడా చేయించిన వైనాన్ని గుర్తుచేశారు. చివరికి విచారణ నెపంతో శ్రీ జగన్‌ను పిలిచి అరెస్టు చేశారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై విచారణ చేయమని ఆదేశిస్తే సిబ్బంది లేరని సిబిఐ సాకు చెప్పిన వైనాన్ని ఆమె తెలిపారు.

డబ్బు సంచుల లెక్క బాబుకు, లోకేష్‌కే బాగా తెలుసు:
లక్ష కోట్ల రూపాయలు సంపాదించారంటూ టిడిసి అధ్యక్షుడు చంద్రబాబు పదేపదే జగన్‌బాబుపై ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి అంత డబ్బెక్కడుందని విజయమ్మ ప్రశ్నించారు. ‘గతంలోనే మైసూరారెడ్డి ఈ లక్ష కోట్ల లెక్క చెప్పారు. జలయజ్ఞంలో వెయ్యికోట్లు, రెండు వేల కోట్ల అవినీతి కూడా దొరకడం లేదని అంటే చంద్రబాబు ఆదేశాలతో దానిని చివరికి లక్ష కోట్లుగా సృష్టించామని స్వయంగా మైసూరాయే చెప్పారు. ఇక ఎమ్మార్  కేసులో రూ.10వేల కోట్ల అవినీతి అని ఆరోపించారు. కానీ విజిలెన్స్  రూ.3వేల కోట్లని చెప్పింది. చివరికి అన్నీ విచారించిన సిబిఐ.. ఏపీఐఐసీకి రూ.43 కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చింది. ఇప్పటికే 70 శాతం విచారణ జరిపిన సిబిఐ మొత్తం లక్ష కోట్ల ఆరోపణలు చేసి నాలుగు చార్జిషీట్లలో కలిపి రూ.800 కోట్లు మాత్రమే అని లెక్క చెప్పింది’ అని వివరించారు. అయితే, చంద్రబాబు తన ఆరోపణలకు ఇంత వరకూ ఆధారాలు చూపించడం లేదేమని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. చంద్రబాబుకు తెలిసిన దొంగ లెక్కలు మహానేత వైయస్‌ఆర్‌కు తెలియవని అన్నారు. డబ్బు సంచుల లెక్కలు చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్‌కే బాగా తెలుసన్నారు. లారీకి ఎన్ని వందల నోట్లు పడతాయో కూడా వారికి చాలా బాగా తెలుసని ఎద్దేవా చేశారు. జగన్‌బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు ఆ పనిని మానుకోవాలని చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. కోటి సంతకాల కార్యక్రమంపై కొన్ని చానళ్ళు చేస్తున్న ప్రచారాన్ని చూస్తే బాధనిపిస్తోందన్నారు.

దోచుకోవడం, దాచుకోవడం వైయస్‌కు తెలియదు:
తన దగ్గర ఉన్నది ఇతరులకు పెట్టడమే మహానేత డాక్టర్‌ వైయస్‌కు తెలుసని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. అంతే కానీ చంద్రబాబులా దోచుకోవడం, దాచుకోవడం ఆయనకు తెలియదన్నారు. దేవుడు ఇచ్చిన పదవితో పదిమందికీ మేలు చేయాలనే వైయస్‌ఆర్‌ చూశారన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఇతర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధిని మహానేత వైయస్‌ చేశారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. అందుకు బహుమతిగానే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారా అని ప్రశ్నించారు. సమాధానం చెప్పుకోలేరనే ధైర్యంతోనే ఆయనపై అపవాదులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ నెపంతో జగన్‌ను ఎన్నిరోజులు జైల్లో పెడతారు?:
విచారణ నెపంతో జగన్‌బాబును ఇంకా ఎన్ని రోజులు జైలులో నిర్బంధిస్తారని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. 90 రోజులు దాటితే బెయిల్‌ పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆమె గుర్తు చేశారు. విచారణ పేరుతో వ్యక్తి స్వేచ్ఛను సిబిఐ హరిస్తోందని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. జగన్‌బాబుపైన విచారణ చేయకుండా, చార్జిషీట్లు వేయకుండా సిబిఐ తాత్సారం చేస్తోంని ఆమె ఆరోపించారు. సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకుతో జగన్‌బాబును ఎన్ని రోజులు నిర్బంధిస్తారని అన్నారు. అరెస్టు చేయక ముందు శ్రీ జగన్‌ 10 నెలలు బయటే ఉన్నారన్నారు. అప్పుడు సాక్షులను ప్రభావితం చేయని జగన్‌బాబు ఇప్పుడు ప్రభావితం చేస్తాడని సిబిఐ చెప్పడంలోని ఔచిత్యాన్ని ఆమె ప్రశ్నించారు.

కోర్టులో అప్పుడెందుకు కౌంటర్‌ వేయలేదు?:
వివాదాస్పద 26 జీఓలు అక్రమమా? సక్రమమా? అని కోర్టు అడిగినప్పుడు ఎందుకు కౌంటర్‌ వేయలేదని రాష్ట్రప్రభుత్వాన్ని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. ఇప్పుడు ఆ జీఓలు సక్రమమే అని ఎందుకు చెబుతున్నదని ప్రశ్నించారు. ఇదే కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను బలిపశువును చేశారని, ధర్మానను ఎందుకు వదిలేశారని అన్నారు. ధర్మానను ప్రాసిక్యూట్‌ చేయడానికి కూడా మంత్రివర్గం ఆమోదించని వైనాన్ని ఆమె పేర్కొన్నారు. మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అని నిలదీశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తోందని దుయ్యబట్టారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లగడపాటి రాజగోపాల్‌ సోదరుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె నిలదీశారు.‌ అవినీతి ఆరోపణలు ఉన్న ఎంపిలు సరేష్‌ కల్మాడీ, ఎ.రాజా, కనిమొళిలకు బెయిల్ ఇచ్చిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుపి సిఎం అఖిలేష్ యాదవ్‌ కేసులో ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ను సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

రాష్ట్రపతి సానుకూల స్పందన :
కేవలం 20 రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది సంతకాలు చేశారని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఆ సంతకాలను స్కానింగ్‌ చేసి సిడిల్లో నిక్షిప్తం చేసి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేశామన్నారు. వాటిని ప్రధానికి పంపిస్తానని ఆయన సానుకూలంగా స్పందించారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలిసి తాము క్షమాభిక్ష అడగలేదని, విచారణ నిలిపివేయాలని కోరలేదని ఆమె తెలిపారు.

అఖిలపక్షంలో చెప్పిందే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి:
తెలంగాణపై పార్టీ అభిప్రాయం ఎలా ఉందని మీడియా ప్రతినిధి అడిగినప్పుడు..‘తెలంగాణపై గతంలోనే పార్టీ ప్లీనరీ సమావేశంలో, మొన్నటి అఖిలపక్షంలో మా వైఖరి చెప్పాం. దానికే మేం కట్టుబడి ఉన్నాం. వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని వ్యక్తమైనా అఖిలపక్ష భేటీలో చెప్పిందే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిగా భావించాలి’ అని విజయమ్మ బదులిచ్చారు. షర్మిల పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుందని అడగ్గా, ఈ నెల 28న వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష చేస్తారని, ఆ తర్వాతే యాత్రపై నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం ఆమె ఫిజియో థెరపీ చేస్తున్నారన్నారు.
Back to Top