'కుట్రలకు వైయస్‌ఆర్‌సిపి దీటుగా బదులిస్తుంది'

అనంతపురం : కాంగ్రెస్‌, టిడిపి కుట్రలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దీటుగా బదులిస్తుందని పార్టీకి చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రజల బలం సమృద్ధిగా ఉందన్నారు. ప్రజా బలం ముందు ఎవరి కుట్రలు, కుతంత్రాలూ పనిచేసే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయినా మంత్రి రఘువీరాకి ‌జ్ఞానోదయం కాలేదన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపికి మద్దతుగా నిలిచిన వారిపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మడకశిరలోని మాజీ ఎమ్మెల్యే వై.టి. ప్రభాకర్‌రెడ్డి నివాసంలో శనివారం తనను కలిసిన విలేకరులతో కాపు మాట్లాడారు.

ప్రస్తుతం సహకార ఎన్నికల్లో కూడా విజయం సాధించడం కోసం మంత్రి రఘువీరా అడ్డదారులు తొక్కుతున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైయస్‌సిపి తరఫున పోటీచేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. అందుకు పోలీసులను ఆయన వాడుకుంటున్నారని విమర్శించారు. మంత్రి రఘువీరా పట్ల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ సారి రఘువీరా దారుణంగా ఓడిపోవడం తథ్యమన్నారు.
Back to Top