కుమ్మక్కు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు

దాచేపల్లి (గుంటూరు జిల్లా) : వెన్నుపోటు, కుమ్మక్కు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్ చంద్రబాబు‌ నాయుడు అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ‌వ్యాఖ్యానించారు. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు వ్యతిరేకంగా రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు టిడిపి ఎంపిలు పాల్గొనకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందమే అని నారాయణపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఎంపిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడ‌మే టిడిపి - కాంగ్రెస్‌ పార్టీల మధ్య జరిగిన ఒప్పందాన్ని రుజువు చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నా ఆశ్చర్యం లేదన్నారు.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మాత్రం వత్తాసుపలకడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ పని అయిపోయిందని గ్రహించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ చేసేందుకు మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రామారావు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం ఆ పార్టీతోనే దోస్తీ చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అసమర్ధంగా ఉందనీ,‌ ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని పాదయాత్రలో పదేపదే మాట్లాడుతున్న చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేసుకున్న కుమ్మక్కు రాజకీయాలను రాష్ట్ర ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Back to Top