దమ్ము, ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిహైదరాబాద్) వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచి, పార్టీ జెండా మార్చి, టీడీపీలో చేరిపోయిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల బండారం బయట పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు ఉండే అవకాశాలు చాలా తక్కువని, అలాంటి కులధృవీకరణ పత్రాన్ని అడ్డుపెట్టి అక్రమాలకు పాల్పడడం అత్యంత దారుణమైందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు. 1993లో జేసీ మంగపతిరావు తనది గిరిజన కులం కాదని చెప్పారు. దానిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నానని, ఎమ్మార్వో, అధికారులను ప్రలోభాలకు గురిచేసి కొత్తపల్లి గీత నకిలీ గిరిజన కులదృవీకరణ పత్రాన్ని సంపాదించారని ఆరోపించారు. కొత్తపల్లి గీత తమ్ముడు కొత్తపల్లి వివేకానందకుమార్ ఎల్ఐసీలో పని చేస్తున్నప్పుడు2008లో గిరిజనుడు కాదని కేసు నమోదైనట్లు ఆమె తెలిపారు. నకిలీ కులధృవీకరణ పత్రాలతో ఉద్యోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఆదివాసి గిరిజనుల ఉద్యోగ సంఘం వారు సైతం గీత కులంపై కేసు వేశారు. ఈ మేరకు ఆ కేసు మీద ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కొత్తపల్లి గీత సోదరుడు గిరిజనుడు కాదని నిర్థారించారన్నారు. ఇప్పటికే ఎన్నోమార్లు కోర్టుకు హాజరుకావాల్సిన గీత అబద్దాలు చెబుతూ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. గతంలో సైతం శోభహైమవతికి ఇటువంటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కొత్తపల్లి గీత నైతికంగా పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను చులకనగా చూస్తున్నారని, గిరిజనులకు వచ్చేట్టువంటి అవకాశాలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కొత్తపల్లి గీతకు దమ్ము, ధైర్యం ఉంటే ముందు రాజీనామా చేసి చూపించాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి గీతపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు.