కిరణ్ సీల్డ్ కవర్ సిఎం!


పోలకల్లు 18 నవంబర్ 2012: కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని షర్మిల ఎద్దేవా చేశారు. "సోనియా గాంధీ పై నుంచి పంపిస్తే, కవర్‌లో వచ్చి దిగిపడ్డారీయన" అని ఆమె ఎగతాళి చేశారు. ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంది రాజశేఖర్ రెడ్డిగారినే తప్ప కిరణ్ కుమార్ రెడ్డిని కాదన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కనీసం మాటమాత్రంగానైనా వైయస్ పేరును ప్రస్తావించక పోవడం పట్ల షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, విజయభాస్కర్ రెడ్డి పేర్లు సైతం గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి పేరుకైనా ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టుకు కారణమైన రాజశేఖర్ రెడ్డిగారి పేరును ఉచ్చరించకపోవడం మనసుకు చాలా బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ మాత్రం సంస్కారం ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. 32వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల ఆదివారం కోడుమూరు నియోజకవర్గంలోని పోలకల్లు బహిరంగసభలో ఉద్వేగంగా ప్రసంగించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై  పదునైన మాటలతో నిప్పులు చెరిగారు.
షర్మిల మాటల్లోనే...
"ఈ రోజు ఇక్కడికి సాగునీరు, తాగునీరు వస్తున్నాయంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డిగారి వల్ల మాత్రమే. కిరణ్ కుమార్ రెడ్డిగారికి ఇంకో మాట కూడా చెపుతున్నాం. ఒక మనిషి మంచితనాన్ని గుర్తు పెట్టుకోవడం సంస్కారమౌతుంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీకు కనీసం ఆ మాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టమని చెపుతున్నాం. ఈ రోజు హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తూ ఆయన ఎన్టీ రామారావు శిలాఫలకాలు వేశారని గుర్తు చేసుకున్నారట. విజయ భాస్కర రెడ్డిగారు సర్వే చేయించారని గుర్తు చేసుకున్నారట. కానీ ఒక్కటంటే ఒక్క మాట రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఒక్కసారి కూడా అనలేదట. ఈ ప్రాజెక్టు చేసింది నిజానికి రాజశేఖర్ రెడ్డిగారైతే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ ముఖ్యమంత్రిగారు రాజశేఖర్ రెడ్డిగారి మాట ఉచ్చరించలేదట. ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిగారూ! రాజశేఖర్ రెడ్డిగారంటే అంత ద్వేషం? అని అడుగుతున్నాం. మీరు పదవిలో ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డిగారు కాదా? అని అడుగుతున్నాం. ఈ ప్రజలు రాజశేఖర్ రెడ్డిగారి పనితీరును గమనించి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా కావాలనుకున్నది రాజశేఖర్ రెడ్డిగారినండీ, మిమ్మల్ని కాదు! కిరణ్ కుమార్ రెడ్డిగారు ఎన్నికై ముఖ్యమంత్రి కాలేదు. సీల్డ్ కవర్‌లో సోనియా గాంధీగారు పై నుంచి పంపిస్తే, కవర్‌లో వచ్చి దిగిపడ్డారీయన. అసలు సోనియా కంటికి కనిపించడానికి కూడా రాజశేఖర్ రెడ్డిగారే కారణం. రాజశేఖర్ రెడ్డిగారు ఈయనని స్పీకర్‌గా చేయకపోతే  ఈయన సోనియాగాంధీ కంటికి కనిపించేవారా? అని అడుగుతున్నాం. అలాంటిది ఒక్కసారంటే ఒక్కసారి కూడా, ఒక్కసారి కూడా రాజశేఖర్ రెడ్డిగారి మాట అనలేదంటే, మనసుకు చాలా బాధనిపించింది.
ఈ రోజు హంద్రీ-నీవా ప్రాజెక్టు అయిపోయిందంటే దానికి కారణం కేవలం రాజశేఖర్ రెడ్డిగారు. ఈ ప్రాజెక్టు అయిపోయిందీ అంటే, దానికి ఎవరికైనా ఘనత ఇవ్వచ్చూ అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డిగారికి మాత్రమే. మేము గర్వంగా చెపుతున్నాం. ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డిగారు కన్నకల. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యిందీ అంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డిగారి వల్ల మాత్రమే పూర్తయ్యింది." అని షర్మిల ఉద్వేగం నిండిన స్వరంతో గాద్గదికంగా వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డిగారు పేరు ప్రస్తావించకపోవడం కిరణ్ అహంకారానికి నిదర్శనమని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రాజశేఖర్ రెడ్డిగారు కృషి చేశారన్నారు. గురు రాఘవేంద్ర, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా తాగునీరు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిగారిదేనని ఆమె అన్నారు. అప్పులు ఎక్కువై  అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. మహిళలు, విద్యార్థులకు రాజశేఖర్ రెడ్డిగారు ఎంతో మేలు చేయగా, ఈ ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు, రైతులను
పట్టించుకోవడం లేదని షర్మిల దుయ్యబట్టారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచే ప్రభుత్వం మహిళల కడుపు మీద కొడుతోందన్నారు. పోలకల్లు సభకు భారీగా జనం హాజరయ్యారు.

Back to Top