కరెంట్‌ నిల్‌, బిల్లు ఫుల్‌ : షర్మిల

పామర్రు (కృష్ణా జిల్లా), 31 మార్చి 2013: మన రాష్ట్రంలో రాష్ట్రంలో పరిస్థితి కరెంట్‌ నిల్‌, బిల్లు ఫుల్‌ అన్న చందంగా ఉందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఏకంగా రూ.32 వేల కోట్లు కరెంటు చార్జీల పేరు మీద ఈ ప్రభుత్వం ప్రజల నెత్తిన ఆర్థిక భారం మోపిందని దుయ్యబట్టారు. విద్యుత్‌ సంక్షోభంతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నా కిరణ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. కరెంట్‌ కోతల కారణంగా అన్నివర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా ఈ సర్కారుకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 107వ రోజు ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడారు. గ్రామాల్లో ఐదారు గంటలే కరెంట్‌ ఇస్తున్నారని, వ్యవసాయానికి అయితే కేవలం రెండు గంటలే ఇస్తున్నారని, అది కూడా రాత్రి పూటేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పక్కన ఎరువుల ధరలు పెరిగిపోయాయి, పంటకు మద్దతు ధర లేదు, మరో పక్కన నీళ్ళు లేవు, రైతన్నకు ప్రభుత్వం నుంచి మద్దతు అంతకన్నా లేదని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. దీనికి తోడు ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచేసిందని, ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ఎనిమిదేళ్ల పాలనలో ఎనిమిది సార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచారన్నారు. కిరణ్‌ కుమార్‌రరెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తూ నాలుగేళ్లలో నాలుగుసార్లు విద్యుత్‌ బిల్లులు పెంచారని దుమ్మెత్తిపోశారు. రైతులంతా అప్పులపాలైపోయి అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. గడచిన సంవత్సరం వచ్చిన పంట నష్టపరిహారాన్నే ఇంతవరకూ రైతుకు చెల్లించని ఈ ప్రభుత్వం ఇక ఈ ఏడాది పరిహారం ఇస్తుందన్న భరోసాయే లేకుండాపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానది నీళ్ళు పుష్కలంగా వచ్చేవని, ఇప్పుడు ఈ ప్రాంతం కూడా వర్షపునీటిపైనే ఆధారపడాల్సి వచ్చిందంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఇంకెంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. వైయస్‌ ఉన్నప్పుడు మినుము క్వింటాల్‌కు ఐదు వేల రూపాయల వరకూ పలికిందని కానీ ఇప్పుడు రైతన్నకు రూ.3.600కు మించి ధర రావడంలేదన్నారు. చెరకు, కవులు రైతుల ఇబ్బందులు చెప్పతరం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. చక్కెర కిలో రూ. 40 ధర ఉందని కానీ చెరకు మాత్రం రూ. 2 వేలకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వరికి ఐదేళ్ళలో రూ.60 మాత్రమే మద్దతు ధర పెంచగా దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఐదేళ్ళలో రూ. 450 పెంచిన వైనాన్ని గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచామని చెబుతున్న మద్దతు ధరలు మూడింతలు పెరిగిన ఎరువుల ధరలకు ఏమాత్రం సరిపోవన్నారు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా అల్లాడిపోతున్నట్లు రాష్ట్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా మహిళలు తల్లడిల్లిపోతున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. ముసలివాళ్ళకు ఇచ్చే రెండు వందల పింఛన్‌ కూడా సక్రమంగా ఇవ్వడంలేదని అన్నారు. ఉన్న రేషన్‌ కార్డులను కూడా ఈ ప్రభుత్వం ఊడదీస్తోందని విచారం వ్యక్తంచేశారు. మహానేత వైయస్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్‌, వంటగ్యాస్‌, బస్సు ఛార్జీలు పెంచలేదని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అనేక సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారని పేర్కొన్నారు. రైతులకు రూ. 12 వేల కోట్ల రుణ మాఫీ చేయించిన ఘనత రాజశేఖరరెడ్డిదే అన్నారు. రైతు రాజుగా బ్రతికిన రోజులవి అన్నారు.

కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. రాజశేఖరరెడ్డి వాగ్దానం చేసిన 9 గంటలు కాదుగదా, ఇచ్చి చూపించిన 7 గంటలూ లేదుకదా కనీసం రెండున్నర గంటలు కూడా ఇవ్వలేక ఆపసోపాలు పడుతోందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. నెలకు 12 గంటలు పవర్‌ కట్‌ విధిస్తే మన రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా బ్రతుకుతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా డెవలప్‌మెంటు సంగతి దేవుడెరుగు పదేళ్ళు వెనక్కిపోయిందని విమర్శించారు. విద్యుత్‌ లేక మూతపడిన పరిశ్రమల్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కార్మికులకు సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

చిరంజీవి బహిరంగంగా కాంగ్రెస్‌ కు అమ్ముడుపోతే, చంద్రబాబు తెరవెనుక అమ్ముడుపోయారని ఆమె ఆరోపించారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. జగనన్న బయట ఉంటే మహానేత వైయస్‌ఆర్‌కు సిసలైన వారసుడిగా నిలుస్తాడనే భయంతో కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర చేసి జైలుకు పంపాయన్నారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఆ రెండు పార్టీలకు లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతూ రాజు అవుతాడని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

జనంతో పోటెత్తిన పామర్రు :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోమోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లా 
పామర్రు చేరుకున్నప్పుడు అభిమానులు ఘనస్వాగతం పలికారు. బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు వచ్చిన జనసందోహంతో పామర్రు పోటెత్తింది. ఎటు చూసినా జనమే కనిపించారు.

షర్మిలను కలిసిన విజయమ్మ :
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న తన కుమార్తె శ్రీమతి షర్మిలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ కలుసుకున్నారు. కృష్ణా జిల్లా కనుమూరులో శ్రీమతి షర్మిలను ఆమె కలిశారు. శ్రీమతి షర్మిల 107వ రోజు పాదయాత్ర మంటాడ, గోపువానిపాలెం, కనుమూరు, కురుమద్దాలి మీదుగా పామర్రు వరకూ కొనసాగింది.

ముగిసిన 107వ రోజు పాదయాత్ర :
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 107వ రోజు పాదయాత్ర పామర్రు శివారులో ముగిసింది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె ఇప్పటి వరకు 1460.2 కిలోమీటర్లు నడిచారు.
Back to Top