మహానేత కుటుంబం జోలికి వస్తే.. తస్మాత్

కాకినాడ :

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే సహించబోమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారో మరచిపోయి మంత్రి తోట నర్సింహం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే వాస్తవాలేమిటో నర్సింహానికే తెలుస్తాయన్నారు. సమైక్యాంధ్ర పట్ల స్పష్టతతో ఉన్న రాజకీయ పార్టీలు‌ ప్రజాబలం ఉన్న వైయస్ఆర్ కాంగ్రె‌స్, సిపిఎం, ఎంఐఎంలు మాత్రమే అన్నారు. పార్టీ జెండాతో సమైక్య ఉద్యమంలో పాల్గొనే దమ్ము, ధైర్యం, సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి తోటపై జ్యోతుల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘మీ రాజకీయ విన్యాసాలు అందరికీ తెలుసు.. ఇకనైనా వాటిని చాలించకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారు. రాజకీయ భిక్ష పెట్టిన వారికే పంగనాలు పెట్టావ్.. ఇప్పుడు సిగ్గు వదిలేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్..‌ జాగ్రత్త.! ప్రజా క్షేత్రంలో నీ పతనం ఖాయం’ అంటూ మంత్రి తోట నరసింహాన్నిజ్యోతుల నెహ్రూ నిప్పులు చెరిగారు. తానొక్కడినే సమైక్య వాదిగా ప్రజలతో ముద్ర వేయించుకునేందుకు మంత్రి తోట తంటాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి తోట నర్సింహం జగ్గంపేటలో మంగళవారం నిర్వహించిన సమైక్య సింహగర్జనలో సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడకుండా కేవలం వైయస్ కుటుంబాన్ని, వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడంపై జ్యోతుల ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈయనను మాజీ మంత్రి అనాలో.. మంత్రి అనాలో అర్థం కావడం లేద'ని ఎద్దేవా చేశారు.

రాష్ర్ట విభజన సంకేతాలు వచ్చిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా రాజీనామాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారన్నారు. సీమాంధ్రులకు అండగా నిలిచారన్నారన్నారు. సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా ఒక వేదిక పైకి వచ్చి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్ర పరిరక్షణ సాధ్యం కాదని, అప్పటి వరకు రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగే అవకాశం లేదన్నారు. దొంగ రాజీనామా చేసిన మంత్రి తోట నర్సింహం తన భార్య వాణి చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ప్రక్రియ నిలిచిపోయిందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

సమైక్యాంధ్రకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందంటూ మహానేత వైయస్‌తో సహా పార్టీ అధినాయకులు చేసిన ప్రకటనలు, విభజన విషయంలో వివిధ పార్టీలు ఇచ్చిన లేఖలతో కూడిన ప్రచార బుక్‌లెట్‌ను పార్టీ నాయకులతో కలసి నెహ్రూ ఆవిష్కరించారు. పార్టీ వాణిజ్య, ఎస్సీ సెల్ కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా కో ఆర్డినేట‌ర్ మిండగుదిటి మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సీతారామచంద్ర వర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు.‌

Back to Top