నిర్వాసితుల‌కు న్యాయం చేయాలి..రెడ్డి శాంతి

శ్రీకాకుళం : వ‌ంశ‌ధార, తోట‌ప‌ల్లి ప్రాజెక్టు నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. జిల్లాలో వంశధార నిర్వాసిత కుటుంబాలు ఏడు వేలు, యువతీ, యువకులకు కలుపుకుంటే 11 వేలు కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వీరిలో ఇప్పటివరకు సుమారు 3 వేలు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. వంశధార ప్రాజెక్టులో ఒక్క యువతీ యువకుడికీ ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆరోపించారు.
తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని పేర్కొన్నారు.   18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు, వికలాంగులు, భర్త విడిచిపెట్టినవారు, వితంతువులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జీవో 68లో సవరణ 2007లో వచ్చినా ఒక్క ప్రాజెక్టులోనూ అమలు జరపలేదని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పాయింట్ నుంచి 100 మీటర్లు దూరం వరకు ఉన్న గ్రామాలూ ముంపు గ్రామాలుగానే సవరణలు వచ్చినా చాలా ప్రాజెక్టుల్లో అమలు చేయడం లేదని ఆవేదన చెందారు.
 ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Back to Top