ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి 

వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం
 
చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైయ‌స్‌ జగన్‌ మండిపాటు 

ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తున్నాం 

ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాం 

వాటి గురించి ప్రశ్నించిన వారిపై చంద్రబాబు సర్కార్‌ కేసులు పెడుతోంది 

సోషల్‌ మీడియాలో ఆ పోస్టులను ప్రజలు చూడకుండా నిరోధిస్తోంది 

ఇది ఆందోళనకర ధోరణి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం 

ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే మా అధికారిక పేజీని పునరుద్ధరించండి 

లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టీకరణ 

కేంద్ర మంత్రులు అమిత్‌షా, అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్‌బుక్‌ను ట్యాగ్‌ చేస్తూ 
‘ఎక్స్‌’లో పోస్టు 

‘సేవ్‌ డెమొక్రసీ, సేవ్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌’ హ్యాష్‌ ట్యాగ్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధి­కారిక ఫేస్‌బుక్‌ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైయ‌స్ఆర్‌సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వే­చ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనా­ల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తా­మని స్పష్టం చేశారు. సేవ్‌ డెమొక్రసీ, సేవ్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్‌బుక్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ హ్యాండిల్‌ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. 

⇒ ఇది కేవలం వైయ‌స్ఆర్‌సీపీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. 

⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది.  

⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్‌ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్‌, సంస్థల దుర్వినియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది.  

⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top