జగన్‌ను కలిసిన టిడిపి ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి

హైదరాబాద్

16 నవంబర్ 2012 :  చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి శుక్రవారం వైయస్.జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చంచల్‌గూడ జైలులో జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 'మర్యాదపూర్వకం'గానే జగన్‌ను కలిసినట్లు చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు, శ్రేయోభిలాషుల అభిప్రాయాల మేరకు త్వరలోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు రాజకీయాలను, టిడిపి ప్రజావ్యతిరేక పోకడలను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. పొమ్మనలేక పొగబెట్టారనీ, తాను ఉండగానే మరొకరిని ప్రమోట్ చేశారనీ, ఇలా టిడిపిలో కొనసాగలేని పరిస్థిని కల్పించారనీ ఆయన అన్నారు. కనీసం నాయకత్వం తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి 30 ఏళ్లుగా తాను ఆ పార్టీలో ఉన్నాననీ, పార్టీని వీడాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదని అమర్‌నాథ్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక విషయం మొదలుకొని టిడిపి ఎన్నో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇదిలావుండగా జగన్మోహన్ రెడ్డితో అమర్‌నాథ్‌ రెడ్డి సమావేశమయ్యారని తెలియగానే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీడీపీ హడావుడిగా ప్రకటించింది.
జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకుగాను చంచల్‌గూడ జైలుకు వచ్చిన అమర్‌నాథ్ రెడ్డి వెంట 'తుడా' మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్తూరు జిల్లాకే చెందిన అమర్‌నాథ్ రెడ్డి కూడా జగన్‌ను కలవడం ఒక కీలక పరిణామం. దాదాపు మూడు దశాబ్దాలుగా అమర్‌నాథ్ రెడ్డి కుటుంబం టిడిపి వెంటే ఉంటూ వచ్చింది. ఆరు సంవత్సరాల పాటు అమర్‌నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో టిడిపి నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే తెలంగాణ విషయంలో సీమాంధ్రవాసులను సంప్రదించకుండానే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Back to Top