జగన్ నాయకత్వంలో అభివృద్ధి తథ్యం

హైదరాబాద్‌, 29 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధించడం తథ్యమని చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్‌ సిపిలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో  తాను చేరడానికి గల కారణాలను నియోజకవర్గం ప్రజలు, శ్రేయోభిలాషులకు‌ వివరిస్తూ మూడు పేజీల లేఖను విడుదల చేశారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత తన నియోజకవర్గం అభివృద్ధిలో‌ బాగా వెనుకబడిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ భిక్ష పెట్టిన వై‌యస్ కుటుంబానికి ఇన్నాళ్ళూ దూరంగా ఉండటం తనను ఎంతగానో కలచివేసిందని రాజేష్‌ కుమార్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వై‌యస్ స్ఫూర్తితో కేవలం మూడు నెల‌ల్లో 26 అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో వైయస్ ఆశయాల కోసం జగ‌న్తో కలిసి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాలు కొత్త అయినప్పటికీ, సాఫ్టువేర్‌ ఉద్యోగం చేసుకుంటున్న తనను 2009 శాసనసభ ఎన్నికలలో చింతపూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక చేసిన ప్రజలకు రాజేష్‌ కృతజ్ఞతలు చెప్పారు. దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరించగలడన్న నమ్మకంతో తనను శాసనసభకు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోనే ఆ మహానేత వైయస్ మరణం తరువాత ఒక్కసారి ‌తన చుట్టూ నిరాశ, నిస్పృహలు కమ్ముకున్నాయన్నారు. ఆ షాక్‌ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితో ఏర్పడిన పరిచయం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన ఓదార్పు యాత్రలో మరింత బలపడి విజయవాడలో జరిగిన జలదీక్ష వరకూ కొనసాగిందని తెలిపారు.
'చింతలపూడి నియోజకవర్గ ప్రజలు తన మీద నమ్మకంతో చాలా ఆశలు పెట్టుకుని అసెంబ్లీకి పంపించారని, వాటిని నెరవేర్చేందుకు ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా మనో ధైర్యంతో ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేయమని వైయస్‌ఆర్‌ జీవించి ఉన్నప్పుడు చెప్పా'రని రాజేష్‌ కుమార్‌ గుర్తుచేసుకున్నారు. వైయస్‌ఆర్ సలహా మేరకు గడచిన మూడున్నరేళ్ళలో చింతలపూడి నియోజకవర్గంలో సాధించిన ప్రగతి గురించి రాజేష్‌ కుమార్‌ ఆ ప్రకటనలో ప్రస్తావించారు.
వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 'మన ఊరు- మన కోసం' కార్యక్రమం రూపొందించి, అధికారులతో ప్రజల వద్దకే వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై వైయస్‌ఆర్‌ కుటుంబంతో కలిసి ప్రయాణించాలనే నిర్ణయంతో తన మనస్సు తేలిక పడిందన్నారు. అందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
Back to Top