జగన్మోహన్‌రెడ్డి విడుదల కోసం ప్రార్థనలు

పులివెందుల : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి త్వరగా బెయిల్ రావాలని,‌ ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ కుటుంబ సభ్యులు ప్రతిరో‌జు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి వారు ఈ ప్రార్థనలు ప్రారంభించారు. మహానేత వైయస్‌ఆర్ మేనత్తలు కమలమ్మ, రాజమ్మ, ‌ఆయన బంధువు సి.వి.సుబ్బారెడ్డి సతీమణి వేద మణమ్మ, ప్రసిద్ధ చిన్నపిల్లల వైద్యులు ఈసీ గంగిరెడ్డి సతీమణి సుగుణమ్మతో పాటు సుమారు 40 మంది ఈ ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పులివెందులలోని జీసెస్ చారిటీ‌స్‌తో పాటు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సొంత ఇంటిలలో ప్రార్థనలు చేస్తున్నారు.

పులివెందుల ‌సిఎస్ఐ చర్చి ఫాస్టర్ ఐజా‌క్ వరప్రసా‌ద్, జీసె‌స్ చారిటీ‌స్ చర్చి ‌ఫాస్టర్ మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ‌ ఈ ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ప్రార్థనలు ఫలించాలని దేవుణ్ని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. కాగా, ప్రతి సంవత్సరం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తనకు ఎన్నిపనులు ఉన్నా క్రిస్మస్ పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు వచ్చేవారని, ప్రస్తుత‌ పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు ఈ నెల చివరి వరకు నిర్వహిస్తామని కమలమ్మ తెలిపారు.
Back to Top