జగన్‌కు జయం కలగాలని యువకుడి సైకిల్‌ యాత్ర

హైదరాబాద్, 15 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి అన్నివిధాలా జయం కలగాలని ఆకాంక్షిస్తూ ఓ యువకుడు నిజామాబాద్‌ జిల్లా నుంచి తిరుపతికి సైకిల్‌ యాత్ర చేస్తున్నాడు. అక్కడి నుంచి తిరుమల వెళ్ళి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కు తీర్చాలని కుంటా రవిరాజ్‌ అనే ఆ యువకుడు సైకిల్‌పై ముందుకు సాగిపోతున్నాడు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండంలోని పాలెం గ్రామంలో ఈ నెల 12వ తేదీన రవిరాజ్‌ సైకిల్‌పై బయలుదేరి 13 సాయంత్రానికి హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా రవిరాజ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడాడు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్‌ ఆశీస్సులతో సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్న రవిరాజ్‌ ప్రస్తుతం పార్టీ యువజన విభాగం మోర్తాడ్‌ మండలం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జైలులో పెట్టించిన జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ తాను సైకిల్‌యాత్ర చేస్తున్నట్లు రవిరాజ్‌ తెలిపాడు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనా కాలంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్నాడు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ కారణంగా ఎన్నో వేల ఎకరాల్లో పంట దిగుబడులు వచ్చాయన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకం వల్ల వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యలు చదువుకునే సువర్ణ అవకాశం కలిగిందని హర్షం వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ పథకం కారణంగా ఎందరో హృద్రోగులకు ఉచితంగా గుండె అపరేషన్లు చేయించుకుని ఆరోగ్యంగా ఉండగలిగే అవకాశాన్ని మహానేత కల్పించారని ఆనందం వ్యక్తం చేశాడు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 108 అంబులెన్సు సేవల ద్వారా ఎందరికో అత్యవసర వైద్య సేవలు అందించే సౌకర్యం ఏర్పడిందన్నాడు. రాజన్న పాలన జనరంజకంగా కొనసాగిందన్నాడు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా లబ్ధి చేకూరిందని అన్నాడు.

రవిరాజ్‌ తనకు ఉన్న కొద్దిపాటి పొలంలో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు పండిస్తానని చెప్పాడు. 
రోజుకు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయమే తిరిగి యాత్రను కొనసాగించాలని ప్రణాళిక వేసుకున్నట్లు చెప్పాడు. ఈ నెల 18న ఇడుపులపాయకు చేరుకుని జగన్‌ సోదరి షర్మిల నిర్వహించే మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటానని  పేర్కొన్నాడు. షర్మిల పాదయాత్ర ప్రారంభమైన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 21వ తేదీకి తిరుపతి చేరుకుంటానని చెప్పాడు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటికి వస్తారని, అనేక సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు రాజన్న రాజ్యాన్ని మరోసారి తీసుకువస్తారని రవిరాజ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Back to Top