జగనన్న రాజ్యంలో రైతు రాజవుతాడు

కృష్ణాపురం క్రాస్ రోడ్డు(చింతలపూడి) 15 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం కృష్ణాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆమెను పామాయిల్, చెరకు రైతులు కలిశారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. ఓపిగ్గా వారు చెప్పింది విన్న శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో తమకు ఎటువంటి కష్టాలూ ఎదురుకాలేదని వారు తెలిపారు. చెరకు రైతులను ప్రభుత్వం పురుగుల్ని చూసినట్లు చూస్తోందన్నారు. రెండేళ్ళుగా చెరకు దిగుబడి పడిపోతోందన్నారు. మద్దతు ధర చాలినంత లేకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు కూలీలుగా మారాల్సి వస్తుందన్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. జగనన్న వస్తే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ఒకపక్క కరెంటు లేక దిగుబడి తగ్గిపోయిందని ఆమె తెలిపారు. ఎరువుల ధరలూ పెరిగాయన్నారు. మద్దతు ధరా పెరగలేదనీ.. దీనివల్ల రైతుకు రెండు రకాలుగా దెబ్బ తగిలిందన్నారు. ఈ పరిస్థితి చాలా అన్యాయంగా ఉందనీ, రైతులు చాలా బాధ పడుతున్నారనీ ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి వస్తుందని రికార్డులు చెబుతున్నాయనీ, అది అంతవరకే పరిమితమైందనీ ఎద్దేవా చేశారు. జగనన్న నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు చక్కబడ్డాయని ఆమె భరోసా ఇచ్చారు. మీరందరూ కలిసి కూర్చుని ఏం చేస్తే రాష్ట్రంలో పామాయిల్ రైతు పరిస్థితి మెరుగుపడుతోందో ఆలోచించాలని సూచించారు. రైతు రాజులా బతకాలనేది దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సూత్రమని గుర్తుచేశారు. రైతుకు చాలా అభిమానం ఉంటుందనీ ఆయన భావించేవారన్నారు. నాకీ కష్టముందీ.. ఈ అప్పులున్నాయనీ చెప్పుకునే తత్త్వం రైతుకు లేదనీ తన తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారనీ, రైతులంటే ఆయనకు ఎంతో గౌరవమనీ ఆమె వెల్లడించారు. అందుకే రాజన్న తొమ్మిదేళ్ళ క్రితం ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారనీ, రుణ బకాయిలను మాఫీ చేశారనీ శ్రీమతి షర్మిల జ్ఞాపకం చేశారు. జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత రైతు మళ్లీ రాజవుతాడని ఆమె హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

Back to Top