జగనే ముఖ్యమంత్రని ప్రజలు నిర్ణయించుకున్నారు

వేజెండ్ల(గుంటూరు జిల్లా) 16 మార్చి 2013:

ఎవరెన్ని కుట్రలు పన్నినా అధర్మానికి ఆయుష్షు తక్కువని శ్రీమతి వైయస్ షర్మిల స్పష్టంచేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల శనివారం రాత్రి గుంటూరు జిల్లా వేజెండ్లలో ఏర్పాటైన భారీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. మరో ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జగనన్న ఏ తప్పూ చేయలేదు కనుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయించే సూర్యుని ఎవరూ ఆపలేరని గర్వంగా చెబుతోందని ఆమె పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో.. మంచివారి పక్షాన ఆయన నిలబడతారన్నది కూడా అంతే నిజమన్నారు. జగనన్న త్వరలోనే బయటకు వచ్చి మనలందర్నీ, ఈ రాష్ట్రాన్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యి ఎంత ప్రయత్నించినా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఈ పార్టీలు మట్టికొట్టుకుపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఇది తథ్యమన్నారు. మన రాష్ట్రంలో ప్రజలు తమకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కూడా ఇప్పటికే నిర్ణయించుసుకున్నారని చెప్పారు. అది జగనన్నేననీ, రాజన్న సిసలైన వారసుడు ఆయన కన్న కలలన్నింటినీ నెరవేరుస్తాడనీ ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నానని  ఆమె చెప్పారు.  ఆరోజు వచ్చేంతవరకూ అందరూ జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి కదం తొక్కాలని కూడా ఆమె కోరారు. సమయం చేసుకుని మాకు అండగా నిలబడినందుకు మీ ప్రేమకు, అభిమానానికీ, ఆప్యాయతకు మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరిస్తున్నానని శ్రీమతి షర్మిల చెప్పారు.
చరిత్ర హీనుడిగా చంద్రబాబు మిగులుతారు
శుక్రవారం అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తెలిపారు. ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికితే చంద్రబాబు మాత్ర ప్రభుత్వానికి మద్దతు పలికారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

Back to Top