'ఇతరుల మతాన్ని దూషించడం సరికాదు'

హైదరాబాద్: వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీది పూర్తి లౌకిక విధానమని, ఇతర మతాలను దూషించడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని అంగీకరించబోదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశంలో మైసూరా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘అక్బరుద్దీన్.., చంద్రబాబు.., కేటీఆ‌ర్.. లే‌దా మరెవరైనా సరే, ఇతరు మతాన్ని దూషించడం తప్పు. అలా దూషించిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానినెవ్వరూ కాదనరు. కానీ, కొందరు రాజకీయ లబ్ధి కోసం, వారి పార్టీల మనుగడ కోసం ఇతర పార్టీలపైన బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను సన్మార్గంలో నడిపించాలి. ప్రజల్లో సహనం పెంపొందించడమే వారు చేయాల్సిన పని. అలా కాకుండా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రజలను ఇంకా రెచ్చగొట్టడం సరికాదు’ అని చెప్పారు.

‘అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. అయితే, అధికారంలో ఉన్నవారు ఒకరి విషయంలో ఒక రకంగా, మరొకరి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రె‌స్‌తో పొత్తు ఉంటే ఒక రకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తామని అనడం మంచి సంప్రదాయం కాదు. చట్టం అందరినీ ఒకేలా చూడాలి. మజ్లిస్ లేదా ‌బిజెపి లేదా టీఆర్ఎ‌స్ లే‌క ఇంకెవరైనా కావచ్చు. మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తప్పు’ అని మైసూరారెడ్డి చెప్పారు.

‘నాలుకలు చీరేస్తాం.. తంతాం... వంటి రకరకాల మాటలను కొందరు వినియోగిస్తున్నారు. వారిని ఏమన్నా అంటున్నామా? అందరి విషయంలో సమానంగా వ్యవహరించాలి’ అని ఆయన అన్నారు. బిజెపి, మజ్లిస్, వైయస్‌ఆర్‌ సిపిలు మతతత్వ పార్టీలని చంద్రబాబు చేసిన విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు మైసూరా స్పందిస్తూ.. ‘ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నపుడు బిజెపి మతతత్వ పార్టీ అని బాబుకు తెలియదా? టిడిపిది గురువింద విధానం. ఎదుటి వారి వైపు ఒక వేలు చూపుతున్నపుడు నాలుగు వేళ్లు మన వైపు చూస్తుంటాయనేది బాబు గుర్తెరిగితే మంచిది’ అన్నారు.

టిఆర్‌ఎస్ విమర్శలపై‌ మైసూరారెడ్డి స్పందిస్తూ.. ‘బట్ట కాల్చి మీద వేసి వెళ్లడం సరికాదు. మర్రి చెన్నారెడ్డి హయాంలో జరిగిన అల్లర్లపై అప్పట్లో విచారణ జరిపిన కమిషన్ దాని నివేదికలో ఎక్కడా వై‌యస్ పేరును పేర్కొనలేదు’ అని తెలిపారు. ‘వై‌యస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ‌రాజకీయంగా ఎదుర్కోలేకే తొలి నుంచీ ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి అని చెప్పి లేనిపోని నీలాపనిందలు వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తప్పుపట్టారు. అయినా ప్రజలు ఉప ఎన్నికల్లో అందరికీ తగిన గుణపాఠం చెప్పి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీని గెలిపించారు. ఇంకేమీ లేక చివరకు ఇలాంటి నీచమైన విమర్శలకు కూడా దిగుతున్నారు’ అని మైసూరా అన్నారు.

జగన్ బెయి‌ల్‌పై వాదించేందుకు సిబిఐకి న్యాయవాదులే లేరా?:
వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ప్రతివాదనలు చేయడానికి న్యాయవాదులు అందుబాటులో లేరని చెప్పడానికి సిబిఐకి సిగ్గుండాలని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. సిబిఐ దర్యాప్తు రాజకీయ జోక్యంతోనే జరుగుతోందనడానికి ఈ ఉదంతం చాలని అన్నారు. కక్ష సాధింపులో కాంగ్రెస్ అధిష్టానానికి ‌సిబిఐ పావులా ఉపయోగపడుతోందని అన్నారు. సిబిఐ, ఎన్‌ఫోర్సుమెంట్ డెరైక్టరే‌ట్ రెండూ రాజకీయ ఒత్తిడితోనే పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. జగ‌న్‌పై అక్రమ కేసులు రావడానికి మూలం చంద్రబాబేనని ఓ ప్రశ్నకు మైసూరా సమాధానం చెప్పారు. చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో మిలాఖత్ అయి కేసులు పెట్టించారని అన్నారు. ఆయనకు ఏ చట్టం తెలుసునని మాట్లాడుతున్నారో తనకైతే తెలియదన్నారు.‌ 'జగ‌న్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో స్వల్ప కాలంలోనే 1.26 కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారంటే ఎంత స్పందన ఉందో తెలుస్తుందని అన్నారు.
Back to Top