ఇది అసమర్ధ ప్రభుత్వం:షర్మిల


ధర్మాపూర్, (మహబూబ్ నగర్ జిల్లా):

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాటం చెప్పాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఎటువంటి పన్నుల భారం మోపకుండా అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిలాంటి గట్టి నాయకుడు అవసరమన్నారు. శ్రీ జగనన్న అధికారంలోకి వస్తే ఇచ్చిన మాటకు నిలబడటమే కాకుండా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందేలా చూస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లాలోని ధర్మాపూర్‌లో మంగళవారం శ్రీమతి షర్మిల యాత్ర కొనసాగింది. ధర్మాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. పాలమూరు జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మంచినీటి కోసం మహిళలు రెండు, మూడు కిలో మీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు.  రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, అనేక మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ప్రస్తుత పాలకులదేనని శ్రీమతి షర్మిల అన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడో పూర్తయ్యేదని, పది లక్షల ఎకరాలకు సాగు నీరందేదన్నారు.

     రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పలు ప్రాజెక్టులు చేపట్టారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఉందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజల కష్టాలు తీరేవన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తాగు నీటి సమస్యతోపాటు నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు పెరిగాయని, విద్యుత్ చార్జీలు పెను భారంగా మారాయన్నారు. దీంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రజల కష్టాలను పట్టించుకోని కేసీఆర్

    టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం పోరాటాలు చేస్తున్నారని, కానీ ఉద్యమాల పేరుతో కొందరు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కాలం వెళ్లబుచ్చుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని శ్రీమతి షర్మిల కోరారు.

     డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబమని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జగనన్నకు మీరంతా అండగా ఉండాలని శ్రీమతి షర్మిల కోరారు.

Back to Top