రైతు కంట కన్నీరు

– నిబంధనల పేరుతో పరిహారం ఎగ్గొడుతున్న సర్కారు 
– కృష్ణాలో 33 మందికి గాను ఒక్కరికీ అందని సాయం
– అండగా ఉండాల్సిన ప్రభుత్వమే బాధితులను వేధిస్తోంది
– కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం

కరువుతో అల్లాడిపోతూ బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని మరింత వేధింపులకు గురి చేస్తోంది. మృతుడి కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం ఎగ్గొట్టేందుకు నెలల తరబడి తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నంది. అలాగైనా విసుగుపుట్టి వదిలేస్తారని సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతోంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అధికారులే స్వయంగా కలిసి విచారణ జరిపి పరిహారం అందజేయాల్సి ఉండగా మండల, జిల్లా కేంద్రాలను వారిని పిలిపించుకుని సూటి పోటి మాటలతో వారి మనస్సు విరిగేలా మాట్లాడుతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉంటే విచారణకు పలిపించి ప్రశ్నలతో వేధిస్తున్నారు. ‘ఊరంతా రైతులు అప్పులు చేసినా బతికుంటే మీ ఒక్కరికే కష్టమొచ్చిందా.. నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా... ఫోరెన్సిక్‌కు పంపుతాం’ అంటూ నీచమైన ప్రశ్నలతో కంటతడి పెట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కోసం బాధితులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి రావడం దౌర్భాగ్యకరం. ఆయా కుటుంబాల్లో ఉన్న పెద్దలకు వృద్ధాప్య పింఛన్, మృతుడి భార్యకు వితంతు పింఛన్‌ కూడా అందకుండా చేస్తున్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా అందాల్సిన రూ. 10 వేలు కూడా చెల్లించకపోవడం మరీ దారుణం.  

1152 మందిలో 126 మందికే పరిహారం
టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్క కృష్ణా జిల్లాలోనే 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదు. వీరంతా కౌలు రైతులే. 2015 ఫిబ్రవరి 19న  జారీ చేసిన జీవో ప్రకారం ఈ కుటుంబాలకు రూ. 5లక్షలు చెల్లిచాలి. అయితే ఇప్పటికి సంవత్సరం గడిచినా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం, ఆర్థిక సాయం అందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 33 నెలల్లో 1152 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 126 కుటుంబాలకే ఆర్థిక సాయం అందించడం ఇంకా దారుణం. అంటే కేవలం 11.52శాతం మందికే సాయం అందించారు. కనీసం కనికరం లేకండా నిబంధనల పేరు చెప్పి పరిహారం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. ఆత్మహత్యలకు ముందు పొరబాటుగా రైతు ఎవరితోనైనా ఘర్షణ పడ్డట్టుగా ఏ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదై ఉన్నా సాధారణ వ్యక్తి ఆత్మహత్యగా పరిగణించి పరిహారం ఆపేస్తున్నారు. అలాగే పంట రుణాలను పంట పెట్టుబడులుగా కాకుండా పిల్లల చదువులు, పెళ్లిళ్ల్లకు వాడినట్టు తెలిసినా రైతు ఆత్మహత్య కింద నమోదు చేయడం లేదు. ఆఖరుకు ఆత్మహత్య సమయంలో రైతు తాగి ఉన్నా పరిహారం నిరాకరిస్తున్నారు. గతంలో పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా స్థానిక రెవెన్యూ అధికారులు నివేదిక ఇస్తే పరిహారం అందేది. నిఘా వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నది. రైతు విపక్ష పార్టీల సానుభూతిపరుడని తమ్ముళ్లు నివేదించినా పరిహారం ఆపేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

కనబడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం
– కౌలు రైతులను వ్యవసాయ కార్మికుల జాబితాలో వేసి పరిహారం ఎగ్గొడుతున్నారు. 
– మహిళా రైతులను బాధితులుగా నమోదు చేయట్లేదు. 
– బాధిత కుటుంబాలకు పరిహారంతోపాటు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రభుత్వ స్కీంలను వర్తింపజేయాల్సి ఉండగా ఎక్స్‌గ్రేషియాతో సరిపెడుతున్నారు.
– రైతు కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే సోషల్‌వెల్ఫేర్‌ స్కూళ్లలో, హాస్టల్స్‌లో చేర్పించాలి. ఇల్లు లేకపోతే ఐఏవై ఇల్లు (పూర్తి సబ్సిడీ) ఇవ్వాలి. 
– జీవనోపాధి సాగించేందుకు స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయాలి. పింఛన్లు ఇవ్వాలి. 
– రుణాల వన్‌టైం సెటిల్‌మెంట్‌కు కేటాయించిన ప్యాకేజీని బ్యాంకుల్లో జమ చేస్తున్నారు తప్ప అప్పులోళ్లతో మాట్లాడి సెటిల్‌ చేయట్లేదు. దీంతో పరిహారం పొందిన రైతు కుటుంబాలు పాత రుణ బకాయిలను వడ్డీలు, చక్రవడ్డీలతో చెల్లించాల్సి వస్తోంది. 
Back to Top