నెల్లూరు, 2012 ఆగస్టు 23 : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి మండిపడ్డారు. దివంగత జననేత వైయస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌ను ఉద్దేశించి ఆనం రామనారాయణరెడ్డి దారుణంగా మాట్లాడుతున్నారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.వైయస్సార్ పట్ల రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదని రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో మార్పులు జరుగబోతున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆనం తమ స్వలాభం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎవరూ బాగుచేసే పరిస్థితి లేదన్నారు. మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చే అవకాశమే లేదని రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.