వైయస్ఆర్‌సీపీలో పార్థసారథి, బూరగడ్డ చేరిక

హైదరాబాద్:

కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి కె.పార్థసారథి, మాజీ ‌డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యా‌స్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్థసారథి ఇటీవలి వరకూ రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాల విద్యా శాఖమంత్రిగా కొనసాగారు. 2009 నుంచీ పీఆర్పీలో ఉన్న వేదవ్యాస్ ఆ పార్టీని కాంగ్రె‌స్‌లో విలీనం చేసిన తరువాత అందులో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామాలిచ్చిన ఈ ఇద్దరు నేతలు శనివారం పెద్ద సంఖ్యలో  తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి వచ్చి పార్టీలో చేరారు. పార్థసారథి, వేదవ్యాస్‌ శ్రీ జగన్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రీ జగన్ నివాసం పరిసరాలన్నీ కృష్ణా‌ జిల్లా కార్యకర్తలతో కిటకిటలాడాయి. ‘జై జగన్’ నినాదాలతో మారుమోగాయి.  కృష్ణా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అని‌ల్‌కుమార్, ఉయ్యూరు, కంకిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు గోన మదన్, సాదిక్, ఉయ్యూరు చెరకు అభివృద్ధి మండలి చైర్మ‌న్ ‌ఎన్. సతీశ్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు వైయస్ఆర్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పార్థసార్థి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారన్నారు. శ్రీ జగన్ సారథ్యంలోనే పేదల కష్టాలు తీరతాయని విశ్వసిస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్రలో శరవేగంగా అభివృద్ధి జరగాల్సి ఉందని, అది శ్రీ జగన్ నేతృత్వంలోనే సాధ్యమని అన్నారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఉందని, తాను కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నానని బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి‌ శ్రీ జగన్‌తోనే సాధ్యం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రజలకు అవసరమన్నారు. మహానేత వైయస్ఆర్ పథకాల‌ను అమలు చేయగలిగిన వ్యక్తి జగనే అన్నారు.

Back to Top