ఎస్సీ, ఎస్టీల భూములు తిరిగి ఇప్పిస్తాం


మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా):

దళితులు, గిరిజనుల శ్రమను దోచుకోవడమే కాకుండా వారి రక్తాన్ని ఈ ప్రభుత్వం పీల్చుకు తాగుతోందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు మహానేత రెండు ఎకరాల సాగు భూమి ఇస్తే పాలకులు రాబందుల్లా లాక్కున్నారని ధ్వజమెత్తారు.

     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బుధవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పట్టా భూములను ప్రభుత్వం తీసుకుందని శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. తమ భూములకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. గ్రామంలో తాము ఎదుర్కొంటున్నా బాధలు వర్ణణాతీతమన్నారు. సర్ చార్జీలతో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

     ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్నది రాబందుల రాజ్యం, రాక్షసుల రాజ్యం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం మహానేత రెండు ఎకరాల భూమి ఇస్తే ఈ ప్రభుత్వం లాక్కుందన్నారు. ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి దళిత, గిరిజనుల కడుపు మీద కొట్టిందన్నారు.

     ఎస్సీ, ఎస్టీల భూముల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములను తిరిగి దళిత, గిరిజనులకు ఇప్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. పేదరికంలో మగ్గుతున్న ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపడం తగదన్నారు.

     అక్టోబర్ 18న ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం నాటికి 772.80 కిలో మీటర్ల మేరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు.

తాజా వీడియోలు

Back to Top