డు‌మ్మాతో వెల్లడైన టిడిపి- కాంగ్రెస్ కుమ్మక్కులు

న్యూఢిల్లీ: దేశంలో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎఫ్‌డిఐల వల్ల దేశంలో రైతుల దగ్గర నుంచి చిల్లర వర్తకుల వరకూ కోట్లాది మంది తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని గ్రహించినందువల్లే ప్రజాభీష్టానికి అనుగుణంగా తమ పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు.

ఒకవైపు ఎఫ్‌డిఐలను టిడిపి వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందు‌కే చంద్రబాబునాయుడు తమ ఎంపిలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేశారని అన్నారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మేకపాటి ఆరోపించారు.

మన రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజాభిమానాన్ని కోల్పోయిన చంద్రబాబు తిరిగి అధికారం కోసమే పాదయాత్ర చేపట్టారన్నారు. ఆయన ఎన్ని ప్రయాసలు పడినా అధికారం దక్కించుకోవడం కల్ల అని మేకపాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు లోక్‌సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోలా వ్యవహరించి తన ద్వంద్వ నీతిని మరోసారి చాటుకున్నారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికార, విపక్షాలు కుట్రలు పన్ని శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైలులోనే ఉంచాలని చేస్తున్న కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగబోవని మేకపాటి అన్నారు.
Back to Top