<strong>కర్నూలు, 15 నవంబర్ 2012:</strong> వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం రాత్రికి కర్నూలు జిల్లాలోని దొడ్డిమేకల చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల స్థానికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల సమస్యల గురించి ఈ సందర్భంగా షర్మిల వారితో చర్చించారు.<br/>అంతకు ముందు పెద్ద కడుబూరులో షర్మిల అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ, మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను మూడేళ్ళుగా గాలికొదిలేసిందని, అయినా, ప్రతిపక్ష టీడీపీ చోద్యం చూస్తూనే ఉన్నదని నిప్పులు చెరిగారు. తాజాగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయవచ్చని సూచించారు. అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని నిలబెడుతోంది చంద్రబాబేనని షర్మిల ఆరోపించారు.<br/> టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఒక్క సాక్ష్యం లేకపోయినా విచారణ పేరుతో జగనన్నకు బెయిల్ రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలో బయటకు వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.