జగన్ ఒక్కరే సమైక్యాంధ్రకు పెద్ద దిక్కు

శ్రీకాకుళం :

సమైక్యాంధ్రకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అన్ని విధాలుగా పెద్ద దిక్కని, ఆయన వెంటే నడుద్దామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం సభలో శ్రీ వైయస్ జగ‌న్ సమక్షంలో‌ ప్రసాదరావు వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ‌ని వదిలిపెట్టి వైయస్ఆర్‌సీపీలో చేరాల్సిన పరిస్థితులను ఆయన వివరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధి‌ష్ఠానం వ్యవహరించిన తీరు దారుణం అని నిప్పులు చెరిగారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని సహించలేకపోయానని వాపోయారు. జిల్లా నాయకులు, కార్యకర్తలతో తాను నిర్వహించిన సమాలోచన సభలో వారి కోరిక మేరకు తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరినట్లుచెప్పారు.

సమైక్య రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా పోరాడుతూ, ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడిగా శ్రీ వైయస్‌ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచార‌ని ధర్మాన అన్నారు. 2010లో పార్లమెంట్‌లోనే తన వైఖరిని స్పష్టంచేసిన నిజమైన నాయకుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ధర్మాన మాటలతో సభా ప్రాంగణం అంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. ‌టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రసాదరావు విమర్శించారు. రాజకీయ ప్రయోజనం కోసం రెండు ప్రచారసాధనాల సాయంతో ఎంత నీచానికైనా దిగజారే స్థితి చంద్రబాబుది అని దుయ్యబట్టారు. ఆకలికి, కన్నీరుకు రాజకీయాలతో ముడిపెట్టే సంస్తృతి చంద్రబాబుది అని, సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీరు తుడిచే పథకాలు పెట్టి ఆదుకున్న పాలన మహానేత వైయస్ఆర్‌ది అని వివరించారు.

2001-03 మధ్య కాలంలో తీవ్ర కరువొస్తే, అప్పటి సీఎం చంద్రబాబు, ఒక్క రైతుకైనా ఒక్క రూపాయి సాయం చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్ఆర్ ఆధ్వర్యంలో పార్టీల‌కు అతీతం గా సంక్షేమ ఫలాలిచ్చిన సంగతి అందరి మనస్సులోనూ ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు కాలంలో పచ్చచొక్కాల వారికే పథకాలు అందజేశారని విమర్శించారు. ఏవేవో కోరికలతో తాను పార్టీ మారలేదని, ఇక ప్రతి ప్రయోజనం పార్టీ పటిష్టత కోసమేనని తెలిపారు. జిల్లాలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం వంశధార వంటి సమస్యల సాధన కోసం రానున్న ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు.

మహానేత వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మృతితో రాష్ట్రంలో దీపం ఆరిపోయింద విశాఖ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే తై‌నాల విజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సమైక్య రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, దీనికి కారణమైన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉద్యమంలో పాల్గొనడం ఇష్టంలేక పార్టీ‌ని వీడినట్టు తెలిపారు. శ్రీ జగన్‌ను సీఎం చేయడమే తన ప్రధాన లక్ష్యం అన్నారు.

ఉత్తరాంధ్రలో మత్స్యకారుడిని ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత మహానేత రాజశేఖరరెడ్డిదేనని పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు గుర్తు చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం కోసం, సమైక్య రాష్ట్ర సాధన కోసం జగనన్న సమక్షంలో వైయస్ఆర్‌సీపీలోకి చేరినట్లు వివరించారు.

సమైక్య రాష్ట్రం కోసం ప్రజలందరి తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా వై‌యస్ఆర్‌సీపీలో విలీనం చేసి, పార్టీలో చేరానని దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీ రామారావుతో కలిసి తాను చివరి అధికారిక పర్యటన చేసినట్టు గుర్తుతెచ్చారు. అప్పుడు తమ వెంటే ఉన్న దొంగల్లుడు చంద్రబాబు కొద్ది నెలల తర్వాతే మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కాజేశారని, ఆ పదవి కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top