కలసి ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం

హైదరాబాద్ :

రాష్ట్రం సమైక్యంగా‌ కలసి ఉంటేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యం అవుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలని, ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని పార్టీ జిల్లాల నాయకులకు ఆయన సూచించారు. రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల పార్టీ నాయకులతో‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి బుధవారంనాడు లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఆయా జిల్లాల వారీగా నాయకులతో శ్రీ జగన్ విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల అన్ని ప్రాంతాలవారూ లబ్ధి పొందారని గుర్తుచేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకాల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు.

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యం కూడా అని, ఆ దిశగానే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పనిచేస్తుందని‌ శ్రీ జగన్ ‌వారికి చెప్పారు. కొంతకాలంగా కుంటుబడిన సంక్షేమ పథకాలను వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత పెద్ద ఎత్తున అమలుచేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ‌సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు.

Back to Top