ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు

() అవినీతి సొమ్ములతో ఎమ్మెల్యేల కొనుగోలు

() స్పీకర్ ను అడ్డం పెట్టుకొని ప్రలోభాలు

() జాతీయ మీడియాతో వైఎస్ జగన్

న్యూఢిల్లీ) ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ
ఉద్యమంలో భాగంగా న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా
విశదీకరించారు. ఎ ఎన్ ఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ
సారాంశం ఆయన మాటల్లోనే...

        ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం
అపహాస్యం పాలవుతోంది. అసెంబ్లీలో మాకు 67 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 13
మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకొన్నారు. ఈ 13 మందితో ప్రభుత్వానికి ఒనగూరేది ఏమీ
ఉండదు. బీజేపీ కి నలుగురు, కాంగ్రెస్ కు సున్న మంది సభ్యులు ఉన్నారు. అంటే
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నట్లు అన్నమాట. మొన్నటి ఎన్నికల్లో చూసుకొంటే మాకు
45శాతం ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశానికి మాకంటే కేవలం 1.8 శాతం మాత్రమే అధికంగా
వచ్చాయి. అది కూడా రెండు మూడు పక్షాల మద్దతుతో సంకీర్ణ కూటమిగా పోటీకి దిగితే.
అందుచేత రాష్ట్రంలో ఉన్నవి రెండే పార్టీలు. గ్రామాల్లో కూడా ఇప్పుడు రెండే
పార్టీలు కనిపిస్తాయి.

        ఇప్పుడు ప్రతీ ఎమ్మెల్యేకు రూ.
20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొంటున్నారు. అది కూడా ముఖ్యమంత్రే స్వయంగా 20 నుంచి 30
కోట్లు ఆఫర్ చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఎలా ఉంటాయి. ఇంతటి అవినీతి
సొమ్ము ఎక్కడ నుంచి వస్తోంది అని అడగక పోతే అన్యాయం అవుతుంది. కొంతమంది కి మంత్రి
పదవులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు, ఇతర
పార్టీల గుర్తుల మీద గెలిచిన వారిని రాజీనామా చేయించకుండా అనర్హత వేటు వేయించకుండా
ప్రలోభ పెట్టడం, మంత్రి పదవులు ఆఫర్ చేయటం ఎంత వరకు సబబు అని అడుగుతున్నాం.
వాస్తవానికి స్పీకర్ పదవిని అడ్డు పెట్టుకొని ప్రలోభ పడిన వారి మీద అనర్హత వేటు
వేయించకుండా కాపాడుతున్నారు.

        చంద్రబాబు చేస్తున్న అరాచకాల
మీద సవివరంగా పుస్తకం రూపొందించాం. లంచాల కోసం జారీ చేసిన జీవో కాపీలు, స్కాన్ డ్
కాపీలు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ డీడ్ లతో సహా రూపొందించటమైనది. ఈ పుస్తకం
అందరికీ ఇస్తున్నాం. అనేక మంది జాతీయ పార్టీ నాయకుల్ని కలిశాం. అందరికీ పుస్తకాలు
ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఏజన్సీలను కలుస్తున్నాం. అక్కడ కూడా పుస్తకాలు
ఇస్తున్నాం. ఎందుకంటే లక్షా 34 వేల కోట్ల రూపాయిల అవినీతి ఇది. అవినీతికి
సంబంధించిన ఆధారాలు పొందుపరచటం జరిగింది. మొత్తంగా 31 స్కామ్ లు ఇచ్చాం. ఇవన్నీ
ఆధారాలతో సహా ఇచ్చాం.

        అనేక అవినీతి కుంభకోణాలు
జరిగాయి. ఒక ప్రధానమైన అవినీతి కుంభకోణం రాజధాని విషయంలో జరిగింది. దాని వివరాలు
చూస్తే అర్థం అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టబోయేది
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మనస్సులో ఉంది. అయినా సరే వేరే చోట అంటే నూజివీడులో,
నాగార్జున యూనివర్శిటీ దగ్గర అంటూ ఫీలర్లు ఇచ్చారు. మిగిలిన ప్రజానీకం అక్కడ భూములు
కొనేట్లు చేశారు. ఈ లోగా తన బినామీలు, సొంత అనుచరులు మాత్రం రాజధాని ఎక్కడైతే
పెడుతున్నారో అక్కడ భూములు కొనేసుకొన్నారు. అది కూడా రైతుల నుంచి కారు చౌకగా
లాగేసుకొన్నారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న మాట. మే నెలలో రాష్ట్రం ఏర్పడితే
డిసెంబర్ లో రాజధాని ప్రకటన వచ్చింది. అప్పటి దాకా జరిగింది పూర్తిగా ఇదే. ఏడు
నెలల గడువులో సొంత మనుషులు పూర్తిగా భూములు లాగేసుకొని స్థిరపడ్డాక రాజధానిని
ప్రకటించారన్న మాట.

        వాస్తవానికి ముఖ్యమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రెండో ప్రమాణమైన అధికారిక రహస్యాల్ని కాపాడుతాను అని
చేసే ప్రమాణాన్ని తుంగలోకి తొక్కినట్లన్న మాట. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా.
రాజధాని ప్రకటన చేసేందుకు ముందుగానే అన్నీ చక్కబెట్టుకొన్నారు. తర్వాత రెండు
జిల్లాల్లో జోన్ లు ప్రకటించారు. అమాయక రైతుల భూములు మాత్రం అగ్రికల్చర్ జోన్ లోకి
వచ్చాయి. ఇక్కడ భూములు ఇతర అవసరాలకు అమ్మడానికి వీల్లేదన్న మాట. అంటే ఈ భూములకు
ఎప్పటికీ రేటు రాదు. వాటి పక్కనే ఉన్న బినామీలు, వ్యాపారుల భూములన్నీ అర్బన్ ఏరియాలో
వచ్చేట్లుగా చేసుకొన్నారు. ఇక్కడ మాత్రం ధరలు భగ్గుమనేలా చేసేందుకు గాను రైతుల
భూముల్ని అగ్రి జోన్ లోకి నెట్టేశారు. ఈ విధంగా రేట్లు పెంచుకొనేందుకు మరో స్కామ్
చేశారన్న మాట. ఈ విధంగా చూసుకొంటూ పోతే అనేక కుంభకోణాలు కళ్లకు కట్టినట్లుగా
కనపడతాయి.

        రెండేళ్ల కాలంలో  లక్షా
34వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది. 24 నెలల్లో అనేక రకాల స్కామ్ లు జరిగాయి.
ఇంతటి భారీ అవినీతి మీద ప్రతీ రాజకీయ నాయకుడు ద్రష్టి పెట్టాలని అడుగుతున్నాం.
సీబీఐ తో విచారణ జరిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 20, 30
కోట్ల రూపాయిల ఆఫర్ ప్రకటించి మరీ కొంటున్నారు. ఇదే ముఖ్యమంత్రి గతంలో తెలంగాణలో
ఎమ్మెల్యేలను డబ్బుతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయారు. అటువంటి
వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో కూడా అవినీతి చర్యలకు పాల్పడుతున్నారు.

        పార్టీ ఫిరాయిస్తున్న
ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేసే అధికార పరిధి ని 
స్పీకర్ నుంచి తప్పించాలి. దీన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలని డిమాండ్
చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకొంటున్నాం.

        అని వైఎస్ జగన్ అభిప్రాయ
పడ్డారు.  

 

తాజా ఫోటోలు

Back to Top