కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పండి

  • టీడీపీ పాలన ఏడాదిన్నరే
  • మూడున్నరేళ్ల పాలనలో కాకినాడకు ఏం చేశారు బాబూ?
  • ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు 
  • రాజధాని నిర్మాణం బాబు కుటుంబ వ్యవహారమా?
  • చంద్రబాబును ప్రధాని నమ్మకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు 
  • వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
కాకినాడ: చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మూడున్నరేళ్ల పాలనలో కాకినాడుకు టీడీపీ చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇక ఆ పార్టీ ఏడాదిన్నర పాటే అధికారంలో ఉంటుందని, వచ్చేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాకినాడను స్మార్ట్‌ సిటీగా చేస్తామని, పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. మత్య్సకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కాకినాడలో డ్రైనేజ్‌ సమస్య వేధిస్తోందని, దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఏమీ చేయలేని చంద్రబాబు మరో ఏడాదిన్నరలో చేస్తామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మూడున్నర సంవత్సరాల పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు.lరాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంతో ఎన్ని నిధులు తీసుకొని వచ్చారో?, ఎన్ని ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని ధర్మాన డిమాండ్‌ చేశారు. ఇన్నాళ్లు కాకినాడ కార్పొరేషన్‌లో సమస్యలు పరిష్కరించలేదని, ఇక్కడికి యూనివర్సిటీ తీసుకొని వస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. ఓ చిన్న పని కూడా చేసిన దాఖలాలు లేవని ఫైర్‌ అయ్యారు. పొరపాటును టీడీపీకి ఓటు వేస్తే వారు అధికారంలోకి ఉండేది ఏడాది న్నర మాత్రమే అన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు వంద కోట్లు ఖర్చు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ వారికంటే మరో మూడున్నరేళ్లు అదనంగా ఉంటుందని తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కాకినాడ ప్రజల ప్రమాణాలను పెంచుతామని హామీ ఇచ్చారు.

స్పీకర్‌ వ్యవస్థకు అపఖ్యాతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా వారిపై స్పీకర్‌ అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారని, స్పీకర్‌ వ్యవస్థకు అపఖ్యాతి తెచ్చారని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. గవర్నర్‌ కార్యాలయం చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉందన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పిన వారిని కేబినెట్‌లోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.  టీడీపీకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాలుగు రోజుల్లోనే చర్యలు తీసుకుంటారన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే నాలుగు రోజుల్లో అమోదించారని, పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయడం లేదన్నారు. రాజధాని నిర్మాణం గురించి ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రతిపక్షంతో,  ప్రజా సంఘాలతో, మేధవులతో మాట్లాడలేదన్నారు.  శివరామకృష్ణ కమిషన్‌ఆదేశాలు బేఖాతరు చేశారని,  కేంద్ర ప్రభుత్వం సూచనలు తీసుకోలేదని,  కోర్టు ఆదేశాలు పాటించలేదన్నారు. రాజధాని నిర్మాణం చంద్రబాబు ఇంటి వ్యవహారమా అని నిలదీశారు.  ఆ కుటుంబం ఒక్కటే నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నించారు.

1700 చీకటి జీవోలు విడుదల
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లలో 1700 చీకటి జీవోలు విడుదల చేశారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రెండు వర్గాల మధ్య విభేదాలు వస్తే వాటిని పరిష్కరించకుండా రహస్య జీవోలు విడుదల చేశారన్నారు. 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా రహస్య జీవోలు విడుదల చేయలేదని,  టీడీపీ మూడేళ్లలో 1700 జీవోలు విడుదల చేసిందన్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మి  మళ్లి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు వేద్దామా? అలాంటి పార్టీ ప్రభుత్వాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.  

పీఎం ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు
టీడీపీని మిత్రపక్షమైన ఎన్‌డీఏ నమ్మడం లేదని, అందుకే చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.  ప్రధాని ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు.  కేంద్రంతో బాబుకు ఉన్న సంబంధాలు చెడిపోయాయన్నారు. కాకినాడ పెద్ద నాయకులు పుట్టిన ప్రాంతమన్నారు. ఇక్కడ మేధావులు ఉన్నారని, చంద్రబాబు నైజాన్ని గుర్తించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చైతన్యవంతమైన కాకినాడ పౌరులు చంద్రబాబు పాలనను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

Back to Top