పతాక స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ డ్రామా

హైదరాబాద్, 14 నవంబర్ 2013:

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆడుతున్న రాజకీయ డ్రామా పతాక స్థాయికి చేరిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తూర్పారపట్టారు. అధిష్టానమే సమైక్య నివేదిక ఇవ్వమని చెప్పిందని మంత్రి వట్టి వసంతకుమార్ చెబుతుండటం‌తో కాంగ్రెస్ నాటకం‌ మరోసారి బయటపడిందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ‌ (సీడబ్ల్యూసీ) నిర్ణయం చేశాక రాష్ట్ర విభజనపై అధికార కాంగ్రెస్ పార్టీ రెండు నివేదికలు ఎలా ఇ‌స్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయ తార‌స్థాయికి చేరిందన్న విషయం దీనితో బహిర్గతం అయ్యిందన్నారు.‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ నాటకాన్ని గట్టు తీవ్రంగా ఎండగట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ వేయి పడగల కోబ్రా లాంటిదని, కిరణ్‌కుమార్‌రెడ్డి దానిలో భాగమని గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దలకు రహస్యంగా సహకరిస్తూ బయటకు మాత్రం సమైక్య డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నారని గట్టు మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కిరణ్ ధిక్కరించినట్లు లీకులు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.‌ కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా విభజనను వ్యతిరేకిస్తే.. సమైక్యాంధ్రకు కట్టుబడి కృషి చేస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ చర్య తీసుకుని ఉండాలి కదా అన్నారు. ఓదార్పు యాత్ర నిర్వహించినందుకే శ్రీ జగన్మోహన్‌రెడ్డి పట్ల కక్షతో వ్యవహరించిన కాంగ్రెస్‌ అధిష్టానం నిజంగా కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుగుబాటు చేస్తే ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కోరారు. మంత్రుల బృందం సమావేశానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రతినిధులను ఎందుకు పంపించిందని ప్రశ్నించిన టీడీపీ తీరును గట్టు తప్పుపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కచ్చితంగా డిమాండ్‌ చేయడానికి పార్టీ ప్రతినిధులను పంపినట్లు చెప్పారు. జీఓఎం‌ చర్చలకు పార్టీ ప్రతినిధులను పంపాలన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్ నిర్ణయాన్ని టీడీపీ ఎలా ప్రశ్నిస్తుందని ఆయన నిలదీశారు. అర్థంపర్థం లేని ప్రశ్నలు వేస్తూ.. టీడీపీ నాయకులు అయోమయానికి గురవుతున్నందున ఆ పార్టీ కార్యాలయాన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు.

ఉత్తర ప్రదేశ్‌ని నాలుగు రాష్ట్రాలుగా చేయమని గతంలో చెబితే తీర్మానం ఎందుకు చేయలేదని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని గట్టు నిలదీశారు. ఒక్క తెలుగు జాతిపైనే కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలను ప్రదర్శిస్తోంద‌ని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలపై కాంగ్రెస్‌ అధిష్టానానికి ఎందుకంత కక్ష అని గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top