ఆ ధీమా ఉంటే ఎన్నికలకు రా కిరణ్!

హైదరాబాద్ :

కాంగ్రెస్ పార్టీ‌ రాష్ట్రంలో మళ్లీ విజయం సాధిస్తుందనే ధీమా సిఎం కిరణ్ కుమా‌ర్ రెడ్డికి ఉంటే ‌తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. అసెంబ్లీని రద్దుచేసే దమ్ము లేకపోతే అనర్హత వేలు వేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ ‌చేశారు. శానససభ మీడియా పాయింట్ వద్ద‌ ఆయన బుధవారంనాడు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రాగలిగే నాయకత్వ లక్షణాలు తనకు ఉన్నట్టుగా సిఎం భావిస్తుంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. సిఎం కిరణ్ విలేకరులతో ఇష్టాగో‌ష్ఠిగా మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పడాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్న విశ్వాసమే కిరణ్‌కు ఉంటే పార్టీ ప్రాతిపదికన నిర్వహించాల్సిన మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికలను ఎందుకు నిర్వహించ‌టం లేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో 52 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం రెండు స్థానాల్లోనే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలస వెళ్లేవారిని ఆపుకోవడానికే సిఎం కిరణ్ ‌ఈ విధంగా చెప్పుకున్నట్టుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ రహితంగా జరిగే సర్పంచ్ ఎన్నికలను ముందుగా నిర్వహించి గెలిచిన వారంతా తమ వాళ్లని చెప్పుకునేందుకు ‌సిఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారని గడికోట విమర్శించారు. సర్పం‌చ్ ఎన్నికల విషయంలోనూ ఎస్సీలకు రాష్ట్రాన్ని యూని‌ట్‌గా, బిసిలకు జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని సిఎం చెప్పడాన్ని చూస్తే ఈ ఎన్నికలపై ఎవరైనా కోర్టుకు వెళ్లాలని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు ఉందని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top