అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామి రెడ్డి ఆరోపించారు. కరవులు తట్టుకోలేక, రుణమాఫీ మోసం తో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని అయినా సరే చంద్రబాబు పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి పథకం కింద జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్ తో ఉరవ కొండలోని వీరశైవ కళ్యాణ మండపంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ పట్టి సీమ నుంచి 80 టీఎమ్‌సీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని, అటువంటప్పుడు శ్రీశైలం నుంచి రాయల సీమకు నీటిని తరలిస్తూ ఎందుకు జీవో జారీ చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం వట్టి దండగన్న సిద్దాంతంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.