రైతుల విప్లవంలో బాబు కొట్టుకుపోతారు

  • రైతును, భూమిని విడగొట్టే దుసంస్కృతి బాబుది
  • విదేశీయులతో రియలెస్టేట్‌ వ్యాపారానికి మరో 7 లక్షల ఎకరాల భూ సేకరణ
  • పోయేకాలం దాపరించినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయ్‌
  • కేంద్రం కాళ్లు పట్టుకొనైనా రుణమాఫీ చేయాలి
  • భూ సేకరణను వెనక్కి తీసుకోవాలి
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బ్రహ్మానందరెడ్డి 
హైదరాబాద్‌:  రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందుల నుంచి పుట్టుకొచ్చే విప్లవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టుకుపోతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులను బెదిరించి లాక్కున్న 3 లక్షల ఎకరాలు కాకుండా మరో 7 లక్షల ఎకరాల భూ సేకరణ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజధాని పేరుతో భూములు లాక్కొని విదేశీయులతో రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని బత్తుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో రైతులకు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం... ఏ విధమైన నిబంధనలు లేకుండా బంగారు రుణాలతో సహా మాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠాన్ని ఎక్కిన తరువాత రైతుల నెత్తిపై అధిక రుణభారాన్ని మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే వారిని ఆదుకోకపోగా.. వాళ్ల బతుకుదెరువైన భూములను లాక్కొని విదేశీ కంపెనీలకు అంటగట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 54 వేల ఎకరాలకు పైబడి రైతుల నుంచి భూములు లాక్కుంటామని ఆర్థిక శాఖామంత్రి యనమల ప్రకటన ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. 

బాబు వల్లే అప్పుల ఊబిలో రైతులు
చంద్రబాబు రైతు రుణమాఫీ ప్రకటన వల్ల రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి దాపరించిందని బత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ మీటింగ్‌ ఏర్పాటు చేసిన సమయంలో ఈ రాష్ట్రంలో రైతు రుణాలు మొత్తం రూ. 87 వేల 612 కోట్ల రుపాయలు ఉన్నాయని ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. 31–3–14 నాటికి రూ.87 వేల 612 కోట్ల రుణాలుంటే అది 31–03–15 నాటికి రూ. 95 వేల 597 కోట్లు అయ్యాయని,  31–3–16 నాటికి రూ. 99 వేల 923 కోట్లు అయ్యాయి. అదే 30 సెప్టెంబర్‌ నాటికి రూ. లక్షా 3,238 కోట్ల రూపాయల భారం పెరిగింది. అంటే రైతు రుణమాఫీ చేయకపోగా.. రైతు నెత్తిన రుణభారాన్ని అధికంగా మోపారని లెక్కలతో సహా వివరించారు. రుణమాఫీ చేయకపోగా కనీసం వడ్డీ కూడా చెల్లించలేకపోయారని ధ్వజమెత్తారు. కేవలం రూ. 10 కోట్లు మాత్రమే చెల్లించి రుణమాఫీ పూర్తిగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.  శాశ్వతంగా రైతును మోసం చేయడమే మీ విధనామా బాబు..? అని ప్రశ్నించారు. మీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగానైనా రైతు పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారా అని నిలదీశారు. ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటే ధాన్యం మద్దతు ధర 3 శాతం ఉందన్నారు. 

ప్రభుత్వాన్నే రియలెస్టేట్‌ సంస్థగా మార్చారు
దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హాయంలో రైతులకు ఆయన ఏంచేయలేదు అనే ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం దొరకదన్నారు.   దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కొని అమ్ముకునే రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా చంద్రబాబు ప్రభుత్వాన్ని మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. మంచి పనుల కోసం భూ సేకరణ మంచిదే కానీ రైతును సర్వనాశనం చేయడానికి భూ సేకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోయేకాలం దాపరించినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయని ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. బందర్‌ పోర్టు పేరు చెప్పి లక్షల ఎకరాలు సేకరిస్తారా.. ?అనంతలో సోలార్‌ పార్కు మీద భూసేకరణ పేరుతో చేస్తారా.. ?ఇవన్నీ చాలక మళ్లీ మరో 7 లక్షల ఎకరాలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి 7 ఎకరాల భూ సేకరణ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు క్షమాపణ చెప్పి కేంద్రం కాళ్లు పట్టుకొనైనా నిధులు తీసకొచ్చి రుణమాఫీ చేయాలని సూచించారు. లేనిపక్షంలో 2019 ఎన్నికల్లో రైతులు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
Back to Top