రైతు రుణాలపై బాబు సర్కారు నిర్లక్ష్యం

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచని ఎస్ఎల్బీసీ
వ్యవసాయం దండగ అన్న నిశ్చితాభిప్రాయంతో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడుకు అన్నదాతలంటే ఎంతో చిన్నచూపు అందుకు అనేక ఉదాహరణలు
చెప్పుకోవచ్చు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అందాల్సిన పంట రుణాల విషయంలో
చంద్రబాబు సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. స్టేట్లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశాన్ని జరపాలన్న ఆలోచనే చేయని చంద్రబాబు చివరకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళనలు, మీడియా అదిలింపులతో ఆ సమావేశాన్ని జరిపారు. అదీ చాలా ఆలస్యంగా.. ఏదో మమ అన్నట్లుగా జరిపించేశారు. ప్రధాన పంటల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచాలన్న రైతుల డిమాండ్లను అస్సలు పట్టించుకోలేదు. రైతుల పక్షాన బ్యాంకర్లపై వత్తిడి తీసుకురావలసిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. పొరుగున ఉన్న తెలంగాణలో వరితో పాటు ప్రధాన పంటల పంటల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగింది. ఎస్ఎల్బీసీ సమావేశం కూడా షెడ్యూలు ప్రకారం జరగాల్సిన టైమ్లోనే జరిపారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్ఎల్బీసీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంశమే చర్చ జరగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న మొత్తాలనే మెజారిటీ పంటలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ నిర్థారించారు. వ్యవసాయంలో సాగు వ్యయం ప్రతి ఏడాదీ పెరుగుతూ పోతున్నది. అందుకు అనుగుణంగా పంటలకు ఇచ్చే రుణాలను పెంచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా గతం ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్నే ఈ ఏడాదీ కొనసాగించడమంటే రైతులను ఆదుకోకుండా గాలికి వదిలేసినట్లే కదా. సాగు వ్యయం పెరిగిపోయి బ్యాంకుల నుంచి తగినంత రుణం అందకపోతే రైతులు ఏం చేయాలి? అధికమొత్తాలకు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే కదా. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రు.69,549 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ప్రతిపాదించగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు రుణ పరపతి లక్ష్యాలను తగ్గించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రు.65,272 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. అంటే నాబార్డు ప్రతిపాదన కన్నా రు.4,277 కోట్లు తగ్గించారు. ఇదే మొత్తాన్ని ఎస్ఎల్బీసీ సమావేశంలో వార్షిక రుణ పరపతి ప్రణాళికగా ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మూడు జిల్లాల్లో కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సిన రుణాలనే తగ్గిస్తుంటే ఇక కౌలు రైతులను ఎవరు పట్టించుకుంటారు? గత ఆర్థిక సంవత్సరంలో 107.36  లక్షల రైతుల ఖాతాలకు సంబంధించి రు.95,597 కోట్లు రునాలుగా ఉన్నాయి. ఇందులో 44.05 లక్షల రైతుల ఖాతాలకు సంబంధించి రు.35,704 కోట్లు ఓవర్ డ్యూస్గా ఉన్నాయని ఎస్ఎల్బీసీ నివేదిక పేర్కొంటోంది. రైతు రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రకరకాల కారణాలు చూపిస్తూ రైతుల సంఖ్యను, మాఫీ చేసే రుణాల మొత్తాన్ని కుదించేశారు. మాఫీ చేస్తానన్న అరకొర రుణాలను కూడా విడతలవారీగానూ, బాండ్ల రూపంలోనూ చేస్తున్నారు. దాంతో రైతుల రుణాలకు వడ్డీ కూడా తడిసి మోపెడవుతోంది. పాత రుణాలు, వడ్డీ పేరుకుపోతుండడం, చంద్రబాబు సర్కారు రకరకాల నాటకాలాడుతుండడంతో బ్యాంకులు కొత్త రుణాలివ్వడానికి విముఖత చూపిస్తున్నాయి. ఇన్ని మతలబులు ఉండబట్టే బ్యాంకర్లు ఈ ఏడాది నుంచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. కనుక ఇక రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు పుట్టడం ఒట్టిమాట. ఇదంతా చంద్రబాబు ఘనతే.
Back to Top