చంద్రబాబే ఫ్యాక్షనిస్టు

  • బాబు పాలనంతా అవినీతిమయమే
  • ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దోచేస్తున్నారు
  • ప్రాజెక్ట్ ల పేరుతో భారీ దోపిడి చేస్తున్నారు
  • ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా బాబు..?
  • ఎవరో చేసిన పనిని తనదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు
  • రైతులకు తోడుగా నిలిచిన ప్రతిపక్షనేతను విమర్శిస్తారా
  • ఇది టీడీపీ ప్రభుత్వమా..లేక తాలిబాన్ల ప్రభుత్వమా
  • వైయస్సార్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  ధ్వజం
హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు. టీడీపీ నేతలు వైయస్ జగన్ ను ఫ్యాక్షనిస్టుతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫ్యాక్షనిస్టులు తెలుగుదేశం పార్టీ నాయకులేనని దుయ్యబట్టారు. వైయస్ఆర్, వైయస్ జగన్ లు  ఏది చెబుతారో, అది చేసి చూపిస్తారని అన్నారు. అంతేగానీ మీలా ప్రజల సొమ్మును దోచుకుంటూ, ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయరని బాబుకు చురక అంటించారు.  తెలుగుజాతికి సాగు, తాగునీరు అందించాలన్న తపనతో వైయస్ఆర్ పనిచేశారని..కానీ, ఆ ఆలోచన బాబుకు ఏనాడు లేదన్నారు. ఎవరో చేసిన పనిని తన పనిగా చెప్పుకుంటూ దోపిడీ చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే భయపెడతారా...? టీడీపీ ప్రభుత్వమా ఇది తాలిబాన్ ప్రభుత్వమా...?  మీరు అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తిచేశారా...? అవినీతి లేకుండా ఒక్క పనైనా జరిగిందా...? ఆత్మవిమర్శ చేసుకోవాలని బాబుకు సూచించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.....ఏపీలో ఎస్ఆర్ఆర్ లో ఉన్న ధరలు దేశంలో మరెక్కడ లేవని, ఇష్టమొట్చినట్లు పెంచుకుంచున్నారని ఫైరయ్యారు.  వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీలు చేసి మీ డొల్లతనాన్ని, దొంగతనాన్ని బయటపెడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు పారిస్తున్నది  ఖజనా నుంచి డబ్బులే గానీ, పొలాలకు నీళ్లు కాదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. 

తెలుగుగంగను ఎన్టీఆర్ మానసపుత్రికగా చెప్పుకుంటున్న తమ్ముళ్లు ఆ ప్రాజెక్ట్ లో అత్యధిక శాతం పనులు జరిపింది వైయస్ఆరేనన్న సంగతి తెలుసుకుంటే మంచిదన్నారు.  హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్ లను మీరు బచావత్ కాలపరిమితి ముగియకముందే పూర్తి చేసి వుంటే  రాయలసీమకు నికరజలాలు కేటాయింపులు వచ్చేది కాదా...? మిగులు జలాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండేదా..?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాట్లాడితే పట్టిసీమ అంటున్నారు.  2012కు ముందు ఏ పట్టిసీమ ఉంది..? 2012,13,14లో హంద్రీనీవాకు కృష్ణాజలాలు రాలేదా...? మీరు పట్టిసీమ కడితేనే నీళ్లు వచ్చాయా...? పోలవరం పూర్తయితే అందరికీ లబ్ది చేకూరుతుందంటే పట్టించుకోరు. పట్టిసీమకు పెట్టేదాంట్లో పోలవరానికి పెడితే సగమైనా పూర్తయ్యేది అంటే పట్టిసీమకు వ్యతిరేకులు అని అభాండాలు వేస్తారా..? పోలవరంను తామే కడతామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంటే...అలా కాదని ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి పోలవరాన్ని మేమే చేపడుతామని తెచ్చుకొన్నారు. కేంద్రం లేఖ రాసి 24 గంటలు కూడ గడవకముందే  11వేలతో పూర్తయ్యే ప్రాజెక్ట్ కు 44వేల కోట్లు అంచనాలు పెంచి  దోపిడీకి పాల్పడింది మీరు కాదా అని బాబుపై విరుచుకుపడ్డారు. 

ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రంతో చర్చించి, పోలవరానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి  పనులు ముందుకు పోయేలా చూసింది వైయస్ఆర్ అన్న సంగతి అందరికీ తెలుసునన్నారు. పోలవరం పూర్తయితే రాయలసీమ, కోస్తా జిల్లాలు బాగుపడతాయని తెలిసి కూడా బాబు పట్టించుకోవడం లేదని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ హయాంలో పాతిక వేల కోట్ల పనులు చేశారో, అదే లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కి కమీషన్ల కోసం మళ్లీ పట్టిసీమ, పురుషోత్తంపట్నం కాంట్రాక్ట్ ఇచ్చారని దుయ్యబట్టారు. పురుషోత్తపట్నం ద్వారా విశాఖకు నీళ్లు తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారంటూ బాబు తమపై అభాండాలు వేయడం తగదన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎందుకు పక్కనపెట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి  పూర్తి చేసి వాళ్లకు నీళ్లు ఇస్తామంటే మేము ఏనాడైనా వద్దన్నామా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాయలసీమకోసమని ఓ జీవో ఇవ్వగలుగుతున్నారా? మీరు అనంతపురంనకు వాటర్ తీసుకురాగలుగుతున్నారా...? తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి తక్కువగా వస్తున్న 10 టీఎంసీల నీటి గురించి కర్నాటకతో ఏనాడైనా చర్చించారా? ఇవేమీ చేయకుండా  ప్రశ్నించిన ప్రతిపక్ష నేతను విమర్శిస్తారా..? ఓ నాలుకతో బాబు రాయలసీమ ముద్దుబిడ్డనంటాడు. ఇంకో నాలుకతో  నేను, వెంకయ్యనాయుడు అవకాశముంటే అమెరికాలో పుట్టేవాళ్లమంటారు. ఇదేనా రాయలసీమపై మీ ప్రేమ..? మీరా వైయస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు . పుంగనూరు వరకు వైయస్ఆర్ కాలువ తెచ్చాక ఇప్పుడు బాబు కుప్పం బ్రాంచ్ కాలువ గురించి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం వచ్చాక చేసిందేమిటి...? 1994-2004మధ్య ఇంకుడు గుంతలు తవ్వుకోమని చెప్పడం తప్ప ఏమైనా చేశారా...?  రైతుల ఇబ్బందులపై చలించి వైయస్ జగన్ అనంతకు వచ్చారు.  15లక్షలు ఎకరాలు వేరుశనగ ఎండిపోతే, దాని గురించి ప్రశ్నిస్తే రైతుల కరువును పరిహసించారు. కలెక్టరేట్ ముట్టడిని ఎద్దేవా చేశారు. ఉరవకొండలో ప్యాకేజీ 36కు సంబంధించి 86వేల ఎకరాలకు నీళ్లుఇవ్వాలని విశ్వేశ్వర్ రెడ్డి పోరాడుతుంటే..వైయస్ జగన్ వచ్చి మద్దతు తెలిపితే ఫ్యాక్షనిస్టులంటారా..?  అంటూ ప్రకాష్ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు.


2005‍‍-06-07లో హంద్రీనీవా టెండర్లలో యావరేజ్ 20 పర్సంట్ లెస్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చాక పోటీ వేయాలంటే మీ బెదిరింపులకు భయపడాల్సిందే. ప్యాకేజీ 53,8తో సహా 300కోట్ల పనులు మీ అస్మదీయులకు పంచింది వాస్తవం కాదా...?రాష్ట్రవ్యాప్తంగా 10వేల కోట్ల పనులను నామినేషన్ పై మీ అస్మదీయులకు దోచిపెట్టలేదా..? 11వేల కోట్లతో పూర్తయ్యే పోలవరానికి రూ. 44వేల కోట్లకు పెంచినా, దోపిడీ చేసినా, రైతులకు అన్యాయం చేసినా మేం మాట్లాడకూడదా...? ప్రాజెక్ట్ లన్నీ వైయస్ఆర్ పుణ్యమే. గొల్లపల్లి రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టును మీరు రద్దు చేశారు. మంత్రి సునీత దీన్ని ప్రశ్నించకపోగా కుప్పం నీళ్లు తీసుకుపోవద్దా అని మాట్లాడుతుంది. పుట్టపర్తిలో వైయస్ఆర్ హంద్రీనీవా 8వ ప్యాకేజ్ అలైన్ మైంట్ మార్చడం వల్లే బుక్కపట్నం చెరువుకు నీళ్లు ఇచ్చే అవకాశం ఇచ్చారు. దానిలో మిగిలిన 19కోట్లను బాబు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. దీంట్లో మంత్రులు, ఎమ్మెల్యేల వాటా ఎంత అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. బుక్కపట్నం నీళ్లు ఇస్తామని  చెప్పి దోచుకోవడం తప్ప బాబు చేసిందేమీ లేదు. వారం తిరక్కనే జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేసి బిల్లులు సబ్మిట్ చేయడం. ఎవరో చేసింది మేం చేశామని చెప్పడం.  23 లక్షలు ఎకరానికి ధర చెల్లిస్తామన్నా హైకోర్టుకు మీ పార్టీ వాళ్లు వెళితే తప్పుబట్టరు. మాకున్న భూమిని తీసుకోవద్దని అమ్మవారిపల్లి ప్రాంత రైతాంగంవేడుకుంటే దౌర్జన్యపరులా...? వాళ్లను సముదాయించడానికి వచ్చిన జగన్ ను విమర్శిస్తారా..? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని రాయలసీమకు నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

తాజా ఫోటోలు

Back to Top