సాగునీరు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

ఈనెల 6న పులిగడ్డలో నిరాహార దీక్ష.. 

తర్వాత ప్రకాశం బ్యారేజీ వరకు పాదయాత్ర: సింహాద్రి రమేష్‌బాబు

విజయవాడ: కృష్ణా డెల్టా రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో పార్టీ నాయకులు జలవనరుల శాఖ ఎస్‌ఈ జె. గుణకణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు విడుదల చేయాలని, లేదంటే ఈనెల 6న పులిగడ్డలో నిరాహార దీక్ష చేపట్టి, అనంతరం ప్రకాశం బ్యారేజీ వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు.

రైతులను మోసం చేయొద్దు

రైతులు ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టారని, వర్షాల పేరుతో సాగునీరు నిలిపివేయడం అన్యాయమని సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. ఎగువ ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కూడా ప్రభుత్వం సాధించడంలో విఫలమైందని ఆరోపించారు.

సాగునీరు ఇవ్వలేనప్పుడు రైతు సంక్షేమం మాటలేనా?

మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. తుఫాను బాధిత రైతులకు పరిహారం, ఎరువుల సమస్యలు, సాగునీటి కొరత వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వెంటనే సాగునీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

Back to Top