చంద్రబాబు ఎలక్షన్ల కోసం ఏమైనా చేస్తారు!


ఉరవకొండ

3 నవంబర్ 2012 :  చంద్రబాబు ఎలక్షన్ల కోసం ఏమైనా చెపుతాడనీ, ఏమైనా చేస్తాడనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విమర్శించారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు మీ వద్దకు వాగ్దానాలతో వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. నాటి చంద్రబాబు పాలనను ఉదహరిస్తూ విజయమ్మ పలు ప్రశ్నలు సంధించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో షర్మిల 17 వ రోజు పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగిచారు. రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన సంక్షేమపథకాలన్నిటికీ తూట్లు పొడుస్తోందనీ, అన్ని రకాలుగా ప్రజలపై భారం వేస్తోందనీ ఆమె విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ సర్‌చార్జీలు, రిజిస్ట్రేషన్ల పేరుతో వేల కోట్లు దండుకుంటున్నారనీ, మున్సిపల్ పన్నులు, నీటి పన్నులు పెరిగాయనీ, నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయనీ పేదలు మలమల మాడిపోతున్నారనీ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నంతా నిలదీయాల్సిన చంద్రబాబు కిమ్మనడం లేదని ఆమె దుయ్యబట్టారు.
విజయమ్మ మాటల్లోనే...
"ఐదు రోజులు అసెంబ్లీ పెడితే చంద్రబాబుగారు రోజుకు ఐదు నిమిషాలు చివరలో వచ్చిపోయేవారు. అవిశ్వాసం పెట్టమంటే పెట్టనంటున్నారు. ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు పాలించిన బాబు ఆనాడు రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. ఆయననే సలహాదారుగా తీసుకుని ఈ మూడేళ్ల ప్రభుత్వం నడుస్తోంది.  చంద్రబాబు నడకలు, నడతలలో రాజకీయ దురుద్దేశాలు, ఆకాంక్షలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ల కోసం చంద్రబాబు ఏమైనా చెపుతాడు, ఏమైనా చేస్తాడు. ఎన్నికలు త్వరలోనే వస్తాయి కాబట్టి చంద్రబాబు మీ ముందుకు వచ్చి రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఇస్తామంటున్నారు. రుణాల మాఫీ చేస్తామంటున్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామంటున్నారు. గ్యాస్ ధర పెంచమంటున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటున్నారు. నా ప్రభుత్వం గొప్పగా నడిచిందని చెప్పుకుంటూ మళ్లీ అధికారం ఇస్తే ప్రజల సేవ చేసుకుంటానంటున్నాడు.
మరి వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబునాయుడు కాదా? ఉచిత విద్యుత్తు బట్టలు ఆరేసుకోవడానికేనని ఎగతాళి చేసింది చంద్రబాబునాయుడు కాదా? పంటలు ఎండిపోతున్నాయి కరెంటు కావాలంటే, ఎలాగూ ఎండిపోయాయి కదా, ఇంకా కరెంటు ఎందుకని అడిగింది చంద్రబాబునాయుడు కాదా? కరెంటు దొంగతనం చేస్తే వేరే దేశాల్లోనైతే ఉరి తీస్తారు, నేను కాబట్టి జైలుకు పంపుతున్నాన్నాడు చంద్రబాబునాయుడు. ఎనిమిది సార్లు కరెంటు పెంచాడు. ఎన్టీఆర్ ఎన్నికల వాగ్దానాలకు తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? రెండు రూపాయల కిలోబియ్యాన్ని రూ. 5.50 చేసింది చంద్రబాబు కాదా? మద్యపాన నిషేధాన్నిరద్దు చేసింది చంద్రబాబునాయుడు కాదా? బెల్టుషాపులు రద్దు చేస్తామంటున్నారు. బెల్టుషాపులను గ్రామాల్లోకి తెచ్చింది ఆయన కాదా? గ్యాస్ ధర పెంచనే లేదంటున్నాడు. రూ.145 ఉన్న గ్యాస్ ధరను రూ. 315 చేసింది చంద్రబాబు కాదా? ఈ రోజు రుణమాఫీ చేస్తానంటున్నాడు. ఆ రోజు చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు వైయస్ లాగా రుణమాఫీ ఎందుకు చేయలేదు. రాజశేఖర్ రెడ్డిగారిలాగా ఎందుకు ఉచిత విద్యుత్తు ఇవ్వలేదు. ప్రభుత్వ సంస్థలను అమ్మేసినవాడు చంద్రబాబు. ఆనాడు పెన్షన్లు ఒకరు చనిపోతే ఒకరికిచ్చే విధానం అమలు చేశారు చంద్రబాబు. ఇవాళ అది చేస్తాను, ఇది చేస్తానంటున్నాడు. వెనకటికి ఒక సామెత ఉంది. అమ్మకు చీర కొనివ్వలేడు కానీ చిన్నమ్మకు గాజులు కొనిస్తాడట! చంద్రబాబు విషయంలో ఇది నిజమనిపిస్తోంది."
"రాష్ట్రంలో పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఏ సామాజికవర్గమైనా, ఏ ప్రాంతమైనా ఏ జిల్లాలోనైనా ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అంటే లేరనే చెప్పాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. అనుమానం వస్తుంది. రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వైయస్ వెళ్లిపోయాక ఈ మూడేళ్లలో ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా? ఆనాడే సువర్ణయుగం చూశాం. ఆనాడే మేలు జరిగింది. ఆర్టీసీ, కరెంటు, మున్సిపల్ పన్నులు కానీ దేనిమీదా పన్నుల లేవు ఆనాడు. రాజశేఖర్ రెడ్డిగారు ప్రభుత్వం ఉందన్న భరోసా ఇచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఒక్క పైసా కూడా పన్నులు పెంచలేదు. ఇది ఒక రికార్డు. సాచురేషన్ విధానమంటూ అన్నిటికీ అతీతంగా అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చారు.అందరూ నావారే అనుకున్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలని ఆశించారు. తపించారు. ప్రాణం పోయేంతవరకూ అలాగే తపన పడ్డారు. పెద్దకొడుకుగా వృద్ధులకు అభయహస్తం పెన్శన్ అందించారు. వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ భద్రత కల్పించారు. విద్యార్థులకు ఒక తండ్రిగా  ఫీజు రీ -ఇంబర్స్‌మెంట్ తీసుకువచ్చారు. నిరుద్యోగులకు ఒక అన్నగా శిక్షణ ఇప్పించారు. బ్యాంకుల నుండి రుణాలిప్పించారు. ఉండడానికి ఇళ్లు. రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. పావలా వడ్డీ రుణాలిచ్చారు. రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగింది. రుణాలు మాఫీ చేశారు. శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం చేశారు.
2009 లో ఎన్నికల వాగ్దానంగా ఉచిత విద్యుత్తు ఏడు గంటల నుండి తొమ్మిది గంటలకు పెంచుతామన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం 6 కిలోలు ఇస్తామన్నారు.ఐదేళ్లు కరెంటు బిల్లు పెంచలేదు. మరో ఐదేళ్లూ పెంచబోమన్నారు కానీ వైయస్ తర్వాత ప్రభుత్వ ఆ వాగ్దానాలను పట్టించుకోలేదని ఆమె ఆవేదనగా అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్, చంద్రబాబు కలిసి పని చేస్తున్నారనీ, జగన్‌ను ఇబ్బంది పెట్టడమే వాళ్ల ఏకైక కార్యక్రమమనీ ఆమె అన్నారు. ప్రజలలో ఉండే నాయకుడిని తీసుకువెళ్లి జైలుకు పంపారనీ, చివరకు బెయిలు కూడా రానివ్వకుండా చేస్తున్నారనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "కానీ దేవుడు చూస్తున్నాడు. జగన్ బాబు తప్పక బయటకు వస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమపథకాలు మళ్లీ అమలు అవుతాయి." అని ప్రజల హర్షధ్వానాల మధ్య విజయమ్మ ధీమాగా వ్యాఖ్యానించారు.

Back to Top