వైయ‌స్ జ‌గ‌న్‌తోనే వైయ‌స్ఆర్ పాల‌న సాధ్యం

 విజయనగరం : వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రంలో  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలన సాధ్యమవుతోందని  పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జ‌న‌నేత  చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 24న విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనున్న సందర్భంగా దేశపాత్రుని పాలెంలో పైలాన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ ఏర్పాట్లను బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రిశీలించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. నాడు మహానేత వైయ‌స్ఆర్‌  ప్రజాప్రస్థానం నిర్వహిస్తే నేడు ఆయన తనయుడు అంతే నిబద్ధతతో ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తున్నార‌న్నారు. 

ఇప్పటికే 11 జిల్లాలో పూర్తై 12 జిల్లాలో అడుగుపెడుతున్న ప్రజాసంకల్పయాత్రను గొప్ప చారిత్రత్మాక విజయంగా బొత్స వర్ణించారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని.. ప్రతి జిల్లాలో అశేష జనవాహిని ఆయన వెంట కదలి వస్తోందని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ పార్టీనే విజయం సాధిస్తుందని.. విజయం నగరం జిల్లా నుంచే విజయం ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిందని.. అత్యాచారాలలో​ మాత్రం బిహార్‌ను మించిపోయిందని ఆరోపించారు.

చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల, సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తానన్నారు.. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా వాటి ప్రస్తావన కూడా తేలేదని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లలో జిల్లాలో ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా అని బొత్స ప్రశ్నించారు. కమిషన్‌ల కోసమే భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. పోలవరంలో జరిగిన అవినీతి గురించి కాగ్‌ నివేదిక బట్టబయలు చేసిందని తెలిపారు. అవినీతి జరిగింది నిజమే కాబట్టి కాగ్‌ నివేదిక మీద ఇంతవరకూ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. 
 

Back to Top