బాబు ఓడిపోక తప్పదు

  • టీడీపీ నేతలపై కేసులు ఎత్తేస్తూ జీవోలివ్వడం అన్యాయం
  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం
  • న్యాయస్థానంలో చంద్రబాబుకు ఓటమి తప్పదు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ః  టీడీపీ నేతల కేసులను మాఫీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం అత్యంత దారుణమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తన వాడైతే చాలు ఎన్ని నేరాలు చేసినా కేసులు ఎత్తేస్తామన్న చంద్రబాబు ఆలోచన ధోరణిపై ఆర్కే ఫైర్ అయ్యారు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ ఆర్కే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని ఆర్కే పేర్కొన్నారు. 

ఐపీసీ 323,335,341,353,354,376,302,307 నేరాలు చేసిన వారిని తప్పిస్తూ బాబు ప్రభుత్వం జీవోలివ్వడం అన్యాయమన్నారు. భారత శిక్షాస్మృతి కింద లూటీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను నిర్బంధించడం,  మహిళలపై అత్యాచార యత్నాలు, హత్యలు, హత్యాచార యత్నాల్లాంటి నేరాలు చేస్తే పై శిక్షలు విధిస్తారని ఆర్కే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి దగ్గర్నుంచి స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది టీడీపీ నాయకులపై పోలీస్ కేసులుంటే వాటిని ఉపసంహరిస్తూ  చంద్రబాబు అన్యాయంగా జీవోలు విడుదల చేశారని అన్నారు. ఐఎఎస్ నుంచి ఐపిఎస్ వరకు ఓ జీవో విడుదల అవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, చివరకు  న్యాయశాఖ కూడ జీవోను పరిశీలిస్తుందని ఆర్కే పేర్కొన్నారు. ఐతే..ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను భయపెట్టి, ఒత్తిడి తీసుకొచ్చి బాబు జీవోలు విడుదల చేయించడం దారుణమన్నారు.  

మీ ఇష్టమొచ్చినట్టు లూటీలు, హత్యాచారాలు, హత్యలు చేయండి మిమ్మల్ని జీవోలనుంచి కాపాడేందుకు నేనున్నాంటూ సమాజానికి సందేశమిస్తూ బాబు జీవోలు విడుదల చేయడం అన్యాయం, దారుణమని ఆర్కే అన్నారు. ఈ సెక్షన్ లకు మించి సమాజంలో తప్పు చేయడానికి ఆస్కారమే లేదని,  అలాంటి తప్పులు చేసినా కూడ వారు నీతిమంతులు, గొప్పవాళ్లన్నట్టు తప్పిస్తూ జీవోలిచ్చాడంటే ఇంతకంటే అన్యాయమైన పాలన మరొకటి ఉండదన్నారు. న్యాయస్థానం ఇచ్చిన  తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మంగళవారం ప్రభుత్వం ఏ సమాధానం చెుతుందో చూస్తామన్నారు.  ప్రాసిక్యూషన్ చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టంగా చట్టాలు చెబుతున్నా జీవోలిచ్చారంటే... న్యాయస్థానంలో బాబు ఓడిపోక తప్పదన్నారు. 

600కుపైగా అబద్ధపు హామీలు ఇచ్చి అమలు చేయకపోయినా, ఓటుకు నోటు కేసులో దొరికిపోయినా ఇలాంటి జీవోలిచ్చారంటే వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు అధికారమిచ్చారని ఇష్టమొచ్చినట్టు చేద్దామనుకుంటున్నారేమో ఆ రోజులు పోయాయని బాబును హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజలు బాబు పాలనను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు ఓటుకు నోటుకేసు కూడ ఉపసంహరించుకుంటూ జీవోలిచ్చుకుంటాడేమోనని ఎద్దేవా చేశారు.  మా వాళ్లు ఏం చేసినా బయటపడేస్తానంటూ చంద్రబాబు ఇష్టానుసారం చేసుకుంటే పోతే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని అడ్డుకొని తీరుతుందని ఆర్కే అన్నారు. ఇప్పటివరకు బాబు 120 జీవోల్లో 1400మందిని కేసులనుంచి తప్పించాడని అన్నారు. 
Back to Top