బాబు ప్రచారమంతా బోగస్‌

– బాబు పర్యటనలన్నీ నల్లధనాన్ని మార్చుకోడానికే
– మూడేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క పథకం రాలేదు
– ద్రోహం, కుట్ర, అబద్ధాలతో బాబు రాజకీయం
-లెక్కలు చూసుకునేందుకే  దుబయి పర్యటన
– ఒక్కొక్కొటిగా చంద్రబాబు మోసాలను బయటపెడతాం
– వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ 

హైదరాబాద్‌: అసత్య ప్రచారం, పనికిరాని మాటలతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నోరు తెరిస్తే వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌సీపీ నాయకులను ఆడిపోసుకోవడం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారం నిజం కాదని ఒక్కొక్కటిగా బయటకొస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐడీఎస్‌ స్కీమ్‌ కింద 10 వేల కోట్ల నల్లధనం ప్రకటించింది వైయస్‌ జగన్‌ అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తాజాగా ఇన్‌కం ట్యాక్స్‌ దాడులతో తెల్లమొహం వేశాడన్నారు. 

ఇప్పుడేమంటావ్‌ చంద్రబాబూ 
ఆనాడు మా నాయకుడు వైయస్‌ జగన్‌పై చంద్రబాబు చేసిన పదివేల కోట్ల ఆరోపణలన్నీ అవాస్తవేలనని తాజాగా జరిగిన ఐటీ దాడులతో ప్రపంచానికి తెలిసిందన్నారు. పది వేల కోట్లు ఆస్తులు ప్రకటించింది వైయస్‌ జగనేనని అబద్ధాలు ప్రచారం చేసిన చంద్రబాబు, టీడీపీ మంత్రులు ఇప్పుడు నిజం కాదని తేలిన తర్వాత తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడీఎస్‌లో ఆస్తులు వెల్లడించిన వ్యక్తి వివరాలను బయటపెట్టాలని ఆనాడే మోడీకి వైయస్‌ జగన్‌ లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. నీతి నిజాయతీలు, నిప్పు అని ప్రచారం చేసుకునే చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. బాబు మాటలు దొంగే.. దొంగ దొంగ..  అని అరిచినట్టుందన్నారు. బాబుకు తెలిసిన టక్కు టమార విద్యలతో ప్రజలను ప్రలోభ పెడుతున్నారు తప్ప సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రచారం చేసుకున్న బాబు ప్రభుత్వం కనీసం 4 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. బాబు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అయ్యింది. ఒక్క సంక్షేమ పథకైనా అమలు చేశారా.. గర్వంగా చెప్పుకునే ప్రజామోదం ఉన్న పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. 

మోసం, దగ, అబద్ధాలతో పాలన
చంద్రబాబు పాలనంతా మోసం, దగ, అబద్ధాలతోనే సాగుతుందని బొత్స మండిపడ్డారు. బాబు మోసం ముందు కుటుంబ సభ్యులు, ప్రజలు అనే తేడా లేదని పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వాడికి ప్రజలను మోసం చేయడం ఒక లెక్క కాదన్నారు. ఓవైపు ఆస్పత్రుల్లో అనారోగ్యాలతో ప్రజలు చనిపోతుంటే చంద్రబాబు ఆరోగ్యశ్రీని నీరుగార్చే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనమంతా డబ్బుల్లేక బ్యాంకుల చుట్టూ తిరగలేక అల్లాడిపోతుంటే నెలరోజులైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. ఎంతసేపటికీ తానే గొప్ప అని ప్రచార యావ తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే తీరిక ఆయనకు లేదన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు పడే కష్టాలకు కూడా లేఖ రాసింది తానేనంటూ పబ్లిసిటీ కోసం వాడుకోవడం బాబుకే చెల్లిందన్నారు. తీరా పరిస్థితులు బెడిసికొట్టడంతో కిక్కురుమనకుండా పోయారని తెలిపారు. 

అన్నీ బాబుకు ఎలా తెలుస్తున్నాయి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ముందుగానే బాబుకు ఎలా తెలుస్తున్నాయని బొత్స సత్యనారాయణ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆనాడు ఐడీఎస్‌ స్కీం కింద పదివేల కోట్లు వెల్లడించిన వ్యక్తి గురించి ముందే తెలుసుకుని వైయస్‌ జగన్‌ మీద, వైయస్‌ఆర్‌సీపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారని తీరా ఇప్పుడు కాదని నిరూపణ జరిగే సరికి నోరెత్తలేకపోయారని బాబుపై ధ్వజమెత్తారు. నోట్ల రద్దు గురించి కూడా ముందే సమాచారం అందుకుని పెద్ద నోట్లు రద్దు చేయాలని లేఖ రాశారని.. మోడీ ప్రకటనకు సరిగ్గా రెండు రోజుల ముందర హెరిటేజ్‌ కంపెనీని ఫ్యూచర్‌ గ్రూప్‌కు అమ్మేశారన్నారు. తొందర్లోనే దీనివెనుకున్న నిజానిజాలను కూడా బహిర్గతం చేస్తామన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బును మీరే వాడుకోవాలని నల్ల కుబేరులకు ఇవ్వవద్దని నరేంద్ర మోడీ చెప్పడం ఆయన అవివేకమో రాజకీయమో తెలియడం లేదన్నారు. నవంబర్‌ 7 నుంచి నేటి వరకు జన్‌ధన్‌ ఖాతాల్లోని సొమ్మును లెక్కిస్తే ఒక్కో ఖాతాలో కేవలం 2వేలు పెరిగాయే తప్ప నల్లకుబేరులెవరూ జన్‌ ధన్‌ ఖాతాల్లో డబ్బు వేయలేదన్నారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రష్యన్‌ హైకమిషనర్‌కు కూడా నోట్ల కష్టాలతో తిండి తినలేని పరిస్థితి ఎదురు కావడం చూస్తుంటే దేశంలో పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యులకు అర్థంకాని ఈ–వ్యాలెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ అని డబ్బా కొట్టుకోవడం దారుణమన్నారు. తన హెరిటేజ్‌ కంపెనీ షేర్‌ వ్యాల్యూ 190 నుంచి 990కి ఐదు రెట్లు పెంచేసి అమ్ముకుంటే సరిపోయిందా జనం కూడా బాగుపడాలి కదా అని ప్రశ్నించారు. 

లెక్కలు చూసుకోడానికే దుబాయ్‌ పర్యటన 
అమరావతిలో 500 కోట్లు విలువ చేసే వంద ఎకరాల భూమిని కారు చౌకగా బీఆర్‌ శెట్టి గ్రూప్‌కు కట్టబెట్టిన చంద్రబాబు దానికి సంబంధించిన లెక్కలు చూసుకోవడానికి దుబాయ్‌ పర్యటనకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. వైద్యరంగంతో సంబంధంలేని ఆ సంస్థకు అనుమతులు ఎలా ఇచ్చారో తెలియజెప్పాలని డిమాండ్‌ చేశారు. నిన్నటి వరకు సింగపూర్‌ పర్యటనలని సింగపూర్‌ జపం చేసిన బాబు ఇప్పుడు దుబాయ్‌ జపం చేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు. ఆయన తర్వాత ఆర్థిక మంత్రి యనమల ఆస్ట్రేలియా పర్యటన చేస్తారని చెప్పుకొచ్చారు. జనం సొమ్ముతో వీరు చేసే పర్యటనల కారణంగా నష్టమే తప్ప ఒక్క పైసా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశమే లేదని ఆరోపించారు. ఇప్పటికేవారు చెప్పుకున్న 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తిదేనని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా మోసం, దగా, కుట్రలతో రాజకీయాలు చేయడం మాని ప్రజాసంక్షేమం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ముఖ్యమంత్రికి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. 
Back to Top